దమ్ముంటే డైరెక్ట్‌గా రండి.. బీజేపీకి ఆప్ నేతల సవాల్

దమ్ముంటే డైరెక్ట్‌గా రండి.. బీజేపీకి ఆప్ నేతల సవాల్

న్యూ ఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్తో బీజేపీ, ఆప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆప్ నేతలు బీజేపీని టార్గెట్ చేశారు. ఎన్నికల యుద్ధంగా నేరుగా ఎదుర్కోలేక, దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతోందని ఆప్ ఆరోపిస్తోంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. దమ్ము, ధైర్యం ఉంటే బీజేపీ ఎన్నికల్లో తమతో పోటీపడాలని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్, ఢిల్లీ మంత్రి అతిషి సవాల్ విసిరారు. ఎన్నికల్లో నేరుగా తలపడాల్సింది పోయి.. వెనుక నుంచి దర్యాప్తు సంస్థలతో ఎందుకు దాడులు చేయిస్తున్నారో బీజేపీ నేతలు చెప్పాలని సందీప్ పాఠక్ డిమాండ్ చేశారు. తాము ప్రజా సేవ కోసం సర్వస్వం పణంగా పెట్టి వచ్చామని, ఇలాంటి దాడులు, బెదిరింపులకు లొంగేది లేదని సందీప్ పాఠక్ తెలిపారు. బీజేపీ కుట్రలను ప్రజాక్షేత్రంలో తిప్పికొడతామన్నారు. ఈ ఎన్నికలు దేశ ప్రజలకు, బీజేపీకి మధ్య జరుగుతున్న పోరుగా ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యమై ఓటు రూపంలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజల గుండెల్లో ఉంటారని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిపై.. అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని బీజేపీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని సందీప్ పాఠక్ ఆరోపించారు.
పోరాడతాం..
ఎన్నికలంటే బీజేపీ భయపడుతోందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును సీబీఐ, ఈడీ రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా.. అక్రమాలు జరిగాయడానికి ఒక్క ఆధారం లభించలేదన్నారు. ఎన్నికలు సమీపించడంతో కేజ్రీవాల్ను నేరుగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించారని ఆమె అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్టు చేశారని, ఓ పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారని అన్నారు. ఈడీని ఆయుధంగా చేసుకుని రాజకీయాలు చేయడం మానేయాలని ఆమె పిలుపునిచ్చారు. తమ పోరాటం వీధుల నుంచి న్యాయస్థానం వరకు సాగుతుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos