చమురు, టెలికాం రంగాల్లో ప్రభంజనం సృష్టించిన ముకేశ్‌ అంబానీ చూపు ఇ-కామర్స్‌ రంగంపై పడింది. త్వరలోనే జియో, రిలయన్స్‌ రిటైల్‌ కలిసి సరికొత్త ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తాయని శుక్రవారమిక్కడ జరిగిన ఉజ్వల గుజరాత్‌ సదస్సులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ ప్రకటించారు.

జియో, రిటైల్‌ కలిసి.. 
ముందుగా గుజరాత్‌లోని 12 లక్షల మంది రిటైలర్లు, స్టోర్‌ యజమానుల కోసం ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను తీసుకు రానున్నట్లు ఆయన వివరించారు. తమ జియో స్టోర్లు, రిటైల్‌ నెట్‌వర్క్‌ను ఇందుకు ఉపయోగించుకుంటామని తెలిపారు. దేశీయ ఆన్‌లైన్‌ విపణిలో అమెరికా దిగ్గజం అమెజాన్‌ అనుబంధ అమెజాన్‌ ఇండియా, మరో దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా దేశీయంగా మరో అగ్రశ్రేణి సంస్థ ప్రవేశించినట్లవుతుంది. ప్రస్తుతం జియోకు 28 కోట్ల మంది వినియోగదార్లుండగా.. రిలయన్స్‌ రిటైల్‌ సంస్థకు దేశంలోని 6,500 నగరాలు, పట్టణాల్లో దాదాపు 10,000 విక్రయశాలలున్నాయి. జియో ఆప్‌లు, మొబైల్‌ ఫోన్ల ద్వారా విక్రయదార్లను అనుసంధానం చేస్తామని రిలయన్స్‌ రిటైల్‌ ఉన్నతాధికారి వి. సుబ్రమణియన్‌ ఫలితాల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

జులైలోనే ప్రకటన కానీ.. 
గత నెలలో వెలువడిన కొత్త నిబంధనలు కూడా రిలయన్స్‌కు ఉపయోగకరంగా మారనున్నాయి. తాజా నిబంధనల ప్రకారం.. విదేశీ పెట్టుబడులు ఉన్న ఇ-కామర్స్‌ కంపెనీలు.. తమ వాటాదారులకు చెందిన కంపెనీల ఉత్పత్తులను విక్రయించడానికి వీలుండదు. దీని వల్ల అమెజాన్‌, వాల్‌మార్ట్‌(ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలుదారు)ల కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో రిలయన్స్‌ వంటి స్థానిక కంపెనీకి ప్రయోజనాలు లభిస్తాయని తెలుస్తోంది. కాగా, ఇ-కామర్స్‌ రంగంలోకి వచ్చే విషయాలను అంబానీ గత జులైలోనే ప్రకటించినప్పటికీ.. ముందడుగు వేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

రూ.లక్షల కోట్ల పెట్టుబడుల హామీలు  
ఉజ్వల గుజరాత్‌ సదస్సులో ఆర్‌ఐల్‌ సహా ప్రధాన సంస్థల ప్రకటన  
వచ్చే 10 ఏళ్లలో రూ.3 లక్షల కోట్లు: రిలయన్స్‌ గాంధీనగర్‌: వచ్చే పదేళ్లలో గుజరాత్‌లో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కట్టుబడి ఉందని భారత అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. విద్యుత్‌, పెట్రో రసాయనాలు, కొత్త తరం సాంకేతికత, డిజిటల్‌ వ్యాపారాల్లో ఈ పెట్టుబడులు ఉండొచ్చని ఆయన తెలిపారు. ‘రిలయన్స్‌కు గుజరాత్‌ జన్మభూమి, కర్మభూమి. తొలి ప్రాధాన్యం ఎపుడూ ఈ రాష్ట్రానికే’నని శుక్రవారమిక్కడ జరిగిన తొమ్మిదో ‘ఉజ్వల గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సు’ సందర్భంగా అన్నారు. ఇప్పటి దాకా గుజరాత్‌లో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు గుర్తు చేశారు. పండిట్‌ దీనదయాళ్‌ యూనివర్సిటీపై రిలయన్స్‌ ఫౌండేషన్‌ మరో రూ.150 కోట్ల పెట్టుబడులు పెడుతుందని ఆయన హామీనిచ్చారు. అదానీ.. రూ.55,000 కోట్లు: వచ్చే అయిదేళ్లలో గుజరాత్‌ లో రూ.55,000 కోట్ల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఈ సదస్సులో ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద సౌర హైబ్రిడ్‌ పార్క్‌ను ఖవ్డాలో రూ.30,000 కోట్ల తో ఏర్పాటు చేస్తామని వివరించారు. గత అయిదేళ్లలో రూ.50,000 కోట్లు పెట్టామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌పై విశ్వాసాన్ని ప్రోది చేశారని ప్రధాని మోదీని  అదానీ ప్రశంసలతో ముంచెత్తారు. * రష్యాకు చెందిన చమురు దిగ్గజం రోస్నెఫ్ట్‌ ఆధ్వర్యంలోని నయరా ఎనర్జీ(అంతక్రితం ఎస్సార్‌ ఆయిల్‌) గుజరాత్‌లో 850 మి. డాలర్ల (రూ.6,000 కోట్లకు పైగా) పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. తద్వారా పెట్రోరసాయనాల వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు తెలిపింది. * గుజరాత్‌లో పునరుత్పాదక విద్యుత్‌, ఇంధనం, గ్యాస్‌ పంపిణీ వ్యాపారాలపై రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు టొరెంట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుధీర్‌ మెహతా ప్రకటించారు. ఇప్పటిదాకా విద్యుత్‌, ఫార్మా రంగాల్లో ఈ గ్రూప్‌ ఈ రాష్ట్రంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. * ఆదిత్య బిర్లా గ్రూపు వచ్చే మూడేళ్లలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. కొత్త యూనిట్ల ఏర్పాటుతో పాటు సామర్థ్య విస్తరణకు వీటిని ఉపయోగించనున్నట్లు గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా తెలిపారు. * 2020 కల్లా గుజరాత్‌లో మూడో ప్లాంటు చేస్తామని సుజుకీ తెలిపింది. టయోటాతో సాంకేతిక మద్దతు అందుకుని భారత్‌లో కొత్త హైబ్రిడ్‌ వాహనాలను తీసుకువస్తామని ఈ సందర్భంగా కంపెనీ వివరించింది. * గుజరాత్‌లో విద్యుత్‌ వాహనాల తయారీతో పాటు లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీపైనా పెట్టుబడులు పెట్టే యోచన ఉన్నట్లు టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. టాటా కెమికల్స్‌ కూడా తన సోడా యాష్‌ వార్షిక సామర్థ్యాన్ని ఒక మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని భావిస్తోందని ఆయన అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos