సీమ వైసీపీలో యువనేతల జోష్‌!

సీమ వైసీపీలో యువనేతల జోష్‌!

రాజకీయాల్లో నేతల వారసుల హడావుడి కొత్త ఏమీకాదు. అయితే ఇప్పుడు రాజకీయాల్లో వారసులు మరీ యంగ్‌ ఏంజ్‌లోనే రంగంలోకి దిగుతున్నారు. అదే ప్రత్యేకం ఇప్పుడు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాజకీయంలో కీలకపాత్ర పోషిస్తున్న రాజకీయ వారసులు చాలామంది ముప్పైయేళ్ల వయసు తర్వాత రంగంలోకి దిగినవాళ్లే. అయితే ఇప్పుడు రాయలసీమ రాజకీయంలో మరీ కుర్రాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఏదో తండ్రి పేరుతో రంగంలోకి దిగడమేకాదు.. వీళ్లు చాలా చురుకుగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండటం, తండ్రులకు ప్రత్యామ్నాయంగా శరవేంగా ఎదుగుతూ ఉండటం విశేషం.నియోజకవర్గం అంతా వీళ్లు కలియదిరుగుతున్నారు. కార్యకర్తలను కలుపుకుపోతున్నారు. తండ్రుల కన్నా ఆయా నియోజకవర్గాల్లో వీళ్ల జోష్‌ ఎక్కువగా కనిపిస్తూ ఉండటం విశేషం. అనంతపురంజిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి రాజకీయమే సాగుతోంది. అక్కడ నుంచి గత ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి స్వల్పమెజారిటీతో నెగ్గిన సంగతి తెలిసిందే. విశ్వేశ్వరరెడ్డిది చాలా సామాన్య జీవితం. కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న కుటుంబం. హంగూ ఆర్భాటాలు ఉండవు.ప్రజల్లో కలిసిపోతూ ఉంటారాయన. అయితే కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం అంత బాగోలేదు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు రాజకీయాల్లో చురుకుగా కనిపిస్తున్నాడు. పెద్ద వయసేమీకాదు. నిండా పాతికేళ్లు ఉంటాయేమో. అయితే విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్‌ మాత్రం నియోజకవర్గం అంతా కలియదిరుగుతూ.. అందరినీ కలుపుకుపోతూ.. యువనేత ట్యాగ్‌ను సంపాదించేసుకున్నాడు. ఇక సోషల్‌ మీడియాలో కూడా ఇతడి ఫాలోయింగ్‌ తక్కువ ఏమీకాదు.నియోజకవర్గం ఆవల ఇతడెవరో పెద్దగా తెలియకపోయినా.. పదివేల మందికి పైగా ఫేస్‌బుక్‌ ఫాలోయర్లను సంపాదించుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డే వైసీపీ తరఫు నుంచి ఉరవకొండ నుంచి పోటీ చేయనున్నాడు. తనయుడు యాక్టివ్‌గా దూసుకుపోతుండటం విశ్వేశ్వరరెడ్డికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా నిలుస్తోంది. అలాగే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి తనయుడు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.చిరంజీవి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసినప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కరుణాకరరెడ్డి విజయానికి అభినయ్‌ రెడ్డి కారణం అంటారు. నియోజకవర్గంలో ఇప్పుడు భూమన అభినయ్‌ రెడ్డి పేరు తెలియనివారు ఉండరేమో. అంతలా హోరెత్తిపోయేలా దూసుకుపోతున్నాడు భూమన తనయుడు. వచ్చేసారి తిరుపతి నుంచి భూమన బదులు ఆయన తనయుడు అభినయ్‌ పోటీచేస్తే బాగుంటుందనే టాక్‌ కూడా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కార్యకర్తలను కలుపుకునిపోవడమే కాదు.. ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి మరీ పరామర్శిస్తున్నాడట. ఈ విధంగా నియోజకవర్గంలో తనదైన గుర్తింపును సంపాదించుకుంటున్నాడు అభినయ్‌.ఇక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కూడా ఒక కుర్రాడి హడావుడి ఆసక్తిదాయకంగా ఉంది. అతడు జగన్‌ అన్న కుమారుడు డా.వైఎస్‌ అభిషేక్‌రెడ్డి. వైఎస్‌ ప్రకాశ్‌రెడ్డి మనుమడు ఇతను. డా.అభిషేక్‌రెడ్డి ఇప్పుడు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను కలుపుకుని పోవడంలో ఫుల్‌జోష్‌తో కనిపిస్తున్నాడు. పులివెందుల నియోజకవర్గం పరిధిలో వైఎస్‌ కుటుంబీకులందరికీ ఎంతోకొంత గ్రిప్‌ ఉండనే ఉంటుంది. అయితే.. ఇంకా కుర్రాడే అయినా.. తనుమాత్రం నియోజకవర్గంలో క్యాడర్‌కు బాగా చేరువ అవుతున్నాడు.జగన్‌ పాదయాత్రతో పద్నాలుగు నెలలపాటు నియోజకవర్గానికి అందుబాటు లేని తరుణంలో.. అక్కడ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ.. యువనేత ట్యాగ్‌ను తెచ్చుకుంటున్నాడు. నిన్నటి వరకూ జగన్‌ మామ ఈసీ గంగిరెడ్డి అసుపత్రి వ్యవహారాలు డా.అభిషేక్‌రెడ్డినే చూసుకునేవారు. ఇప్పటికే వైఎస్‌ అవినాష్‌రెడ్డి రూపంలో జగన్‌ సోదరుడు కడప ఎంపీగా ఉన్నాడు. ఇప్పడు జగన్‌ అన్నకొడుకు హడావుడి చూస్తుంటే.. ఇతడూ తన కలుపుగోలుతనంతో దూసుకుపోయేలా ఉన్నాడనే మాట వినిపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos