సమయం దగ్గరపడుతోంది… తొందరపడుతోన్న ఎమ్మెల్యేలు

సమయం దగ్గరపడుతోంది… తొందరపడుతోన్న ఎమ్మెల్యేలు

సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. పట్టుమని మిగిలింది 40 రోజులే.. ఆ తదుపరి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగలదన్న సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎడతెగని ఉత్కంఠ. అధికారులను బతిమాలి బామాలైనా సరే పనులు సంపూర్తి కావాలనే ధోరణి ఎమ్మెల్యేల్లో కనిపిస్తుంది. నాలుగున్నరేళ్ళ పాటు పడిన శ్రమ నియోజకవర్గాల్లో ఒకింత స్పష్టంగా కనిపిస్తుండగా, ఇంకా చివరి దశలో ఉన్న పనులన్నీ పూర్తి కావాలనే కాంక్ష బలంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పథకాల్లో కొన్ని నత్తనడకన సాగడం, మరికొన్ని అసంపూర్తిగా మిగలడం, ఇచ్చిన హామీల్లో కొన్నింటికి పరిష్కారం దొరికినా, మరికొన్నింటికి సాచివేత వైఖరి కాస్తా వీరిని బెంబేలెత్తిస్తుంది. ఇక ప్రతీక్షణం విలువైనదిగా భావించి.. గడచిన కొన్నాళ్ళుగా పెండింగ్‌లో పడిన పనులన్నింటిపైనా పునః సమీక్ష చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతుండగా, దీనికి సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ఇంతమేరకు నెరవేర్చినవారం అవుతామనే భావన ఎమ్మెల్యేల్లో ఉంది. నిన్న మొన్నటివరకు మొండికేసిన అధికారులను ఇప్పటివరకు హెచ్చరికలతో సరిపెట్టినా.. ఇప్పుడు వారిని కొంత మెత్త పరిచి పని పూర్తికి మరో ప్రయత్నాలు ఆరంభించారు. డెల్టా నియోజకవర్గాల్లో డెల్టా ఆధునికీకరణ పనులపై మొదటి నుంచి ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. గడచిన రెండేళ్ళుగా డిసెంబర్‌ నుంచే టెండర్‌ పనులు పూర్తి చేసి కాల్వలు కట్టే నాటికి నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధపర్చాల్సిందిగా యంత్రాంగాన్ని కోరుతూ వచ్చారు. కాని ఈ పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. అంతకంటే మించి వరుసగా మూడుసార్లు పిలిచినా కొన్ని టెండర్లకు స్పందనే లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి గల కారణాలు వేరే ఉన్నట్టుగా పదేపదే చెబుతున్నారు. దీంతో గోదావరి కాల్వ శివారు ప్రాంతాల్లో గడచిన ఐదేళ్ళల్లో రైతులను పూర్తి సంతృప్తిపర్చలేకపోయామనే భావన అందరిలోనూ స్పష్టంగా ఉంది. ‘నిన్నమొన్నటి వరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చి పనులు పూర్తి చేయాలని కోరే వాళ్ళం. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి. పట్టుమని నెల రోజులు లేవు. ఆలోపే అన్ని పనులు పూర్తి కావాలని కోరుకుంటున్నాం కానీ.. సంబంధిత అధికారులు ఒక్కసారిగా ముందుకు వచ్చేందుకు సిద్ధపడడంలేదు. రకరకాల కారణాలు చెబుతారు. ఇవన్నీ మాకు నష్టదాయకమే. మొదటి నుంచి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు’ డెల్టా ప్రాంతానికి చెందిన అధికార పక్ష ప్రతినిధులు తాజాగా వాపోతున్నారు. చివరి రోజుల్లో ఏం జరుగుతుందంటే..ఒకవైపు సిమెంటు రోడ్ల నిర్మాణం. మరోవైపు కాల్వల మరమ్మతు. ఆగిపోయిన ఉపాధి హామీ పనులు. పనులు మంజూరైనా.. విడుదలకాని నిధులు. ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్ళు. స్థానికంగా ఉన్న నేతలదీ ఇదే దారి.. వీటితో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల పింఛన్‌ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజామోదం పార్టీ వైపు మొగ్గింది. మాకూ సంతోషంగానే ఉంది. కాని అధికారంలో ఉండి కూడా కొన్నింటిని చేపట్టలేకపోయాం.. మరికొన్నింటిని పూర్తి చేయలేకపోయాం. ఇదంతా ఎవరికీ చెప్పుకునేదికాదు.. అంటూ మునిసిపల్‌ కౌన్సిలర్ల దగ్గర నుంచి మాజీ సర్పంచ్‌ వరకు వినిపిస్తున్న వాదన. కాని అధికారుల మీద ఆధారపడడం ఒక తప్పు.. అంతకంటే మించి సమయాన్ని అంచనా వేయలేకపోవడంతో ఇంకో తప్పు అంటూ కార్యకర్తల ఎదుటే ఈ తరహా ప్రజాప్రతినిధులంతా కాస్తంత ఆగ్రహంతో చెబుతున్నారు. ఇంటింటికీ కుళాయి పథకం రూ.870 కోట్లతో ఇదే జిల్లాలో ఆరంభమైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పథకం ప్రజలకు ఆకర్షణీయంగా ఉండాలి. కాని చెప్పుకోదగిన స్థాయిలో ప్రచారం చేయలేకపోయాం. ఎంతసేపు రేషన్‌కార్డులు, ఇంకోదానికోసమే వెంపర్లాడామే తప్ప ప్రజల మదిలో ఉన్న మరికొన్నింటిని తీర్చే సమయం లేకుండా పోయింది.. అంటూ ఇంకొందరి ఆవేదన. ఇక శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలుఇక మిగిలింది అత్యంత కీలక సమయం. ప్రజల ముందుకు వెళ్ళాల్సిన సమయం రానే వచ్చింది. అందుకే రాబోయే రోజుల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అంతా సిద్ధమవుతున్నారు. రోడ్లు దగ్గర నుంచి మంచినీటి కుళాయి వరకు అన్నింటినీ వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇతర పార్టీలకు ఏ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకనే జిల్లా స్థాయిలో అధికారుల నుంచి అనుమతులు పొందిన అన్ని పనులకు రాబోయే 15 రోజుల్లో శంకుస్థాపనలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే మరిన్ని ప్రారంభోత్సవాలకు సంసిద్ధమవుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న తరుణంలో ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో సరికొత్తగా పనుల ఆరంభానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos