సగం సంపద.. 9 మంది వద్దే

  • In Money
  • January 21, 2019
  • 773 Views
సగం సంపద.. 9 మంది వద్దే

దిల్లీ : భారత్‌లో కోటీశ్వరుల ఆదాయంలో గత ఏడాది భారీ పెరుగుదల కనిపించింది. 2018లో వారి ఒక రోజు  ఆదాయం రూ.2,200 కోట్లకు చేరింది. దేశంలో అత్యంత ధనవంతుల్లో 1 శాతం మంది ఆదాయం 39 శాతం పెరగ్గా.. దిగువ భాగంలో ఉన్నవారి ఆదాయం మాత్రం 3 శాతం మాత్రమే పెరగడం గమనార్హం. ఈ వివరాలను అంతర్జాతీయ హక్కుల సంస్థ ‘ఆక్స్‌ఫామ్‌’ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశం మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంస్థ తన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. భారత్‌లో 10 శాతం జనాభాకు సమానమైన 13.6 కోట్ల మంది ప్రజలు 2004 నుంచి అప్పుల్లోనే కొనసాగుతున్నారు. సంపద అంతా కొందరి వద్దే కేంద్రీకృతమవుతోంది. మానవజాతిలో సగం పేదవారి(13.6 మిలియన్‌ ప్రజల) వద్ద ఉన్న మొత్తం ఆదాయం కేవలం 29 ధనికుల వద్ద ఉండటం గమనార్హం. గతేడాది ఇంత ఆదాయం 44 మంది వద్ద ఉండేది.* ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బేజోస్‌ సంపద 112 బిలియన్‌‌ డాలర్లకు చేరుకుంది. ఆయన ఆదాయంలో 1 శాతం ఆదాయం 115 మిలియన్‌ జనాభా ఉన్న ఇథోపియా దేశ ఆరోగ్య బడ్జెట్‌తో సమానం కావడం విశేషం.ఇక భారత్‌లో పది శాతం ధనికులు జాతీయ ఆదాయంలో 77.4 శాతం కలిగి ఉన్నారు. జనాభాలో ఒక శాతం సంపన్నుల వద్ద 51.53శాతం సంపద పోగుబడింది. ఇక దిగువన ఉన్న 60 శాతం మంది.. జాతీయాదాయంలో 4.8 శాతం సంపద మాత్రమే కలిగి ఉన్నారు. భారత్‌ జనాభాలో 50 శాతం మంది సంపద కేవలం 9 మంది బిలియనీర్ల వద్ద కేంద్రీకృతమై ఉంది.2018-2022 మధ్య భారత్‌ నుంచి  కొత్తగా రోజుకు 70 మంది మిలియనీర్లు పుట్టుకువస్తారని ఆక్స్‌ఫామ్‌ అంచనా వేసింది. గత ఏడాది భారత్‌లో కొత్తగా 18 మంది బిలియనీర్లు పుట్టుకువచ్చారు. దీంతో మొత్తం బిలియనీర్ల సంఖ్య 119కి చేరింది. వీరి మొత్తం ఆదాయం తొలిసారిగా 400 బిలియన్‌ డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు చేరింది.  దేశంలోని ఒక శాతం ఉన్న అత్యంత సంపన్నులు వారి  సంపదపై కేవలం 0.5శాతం మాత్రమే అదనంగా పన్ను చెల్లించడం కొసమెరుపు.

తాజా సమాచారం