షర్మిలా! నీ అన్న చొక్కాపట్టుకొని అడుగు

షర్మిలా! నీ అన్న చొక్కాపట్టుకొని అడుగు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పైన అసభ్య పోస్టులు, హైదరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు రాజకీయ దుమారం రేపుతోంది. తమపై అసభ్య ప్రచారం జరుగుతున్నా ఏపీ పోలీసులు పట్టించుకోవడం లేదని, ఏపీ పోలీసులపై నమ్మకం లేకే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామని వైసీపీ చెబుతోంది. ఏపీ పోలీసులపై నమ్మకం లేదనే షర్మిల వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన అవసరం లేదని వైసీపీ అభిప్రాయపడుతోంది. టీడీపీ ప్రభుత్వం వారిని గుప్పెట్లో పెట్టుకుందని, కాబట్టి ఏం చేయలేకపోతున్నారని అభిప్రాయపడింది. అదే సమయంలో, షర్మిళపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తమకు సంబంధం లేదని టీడీపీ చెబుతోంది. తమది అలాంటి సంస్కృతి కాదని చెబుతోంది.

షర్మిలా! ముందు జగన్ చొక్కా పట్టుకొని అడుగు..

మహిళలను కించపరిచే సంస్కృతి తమది కాదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఓ మహిళను కించపరిచేలా ఎవరు చేసినా తప్పే అన్నారు. ఇలాంటి ప్రచారం షర్మిల పైనే కాదు, ఏ మహిళ పైన జరిగినా తాము ఖండిస్తామని చెప్పారు. మహిళా ఐఏఎస్, మహిళా మంత్రులను జైలుకు పంపిన చరిత్ర జగన్‌ది అన్నారు. సాటి మహిళలపై షర్మిలకు గౌరవం ఉంటే ముందు తన అన్న జగన్ చొక్కా పట్టుకొని అడగాలన్నారు.

టీడీపీకి ఆ నీచ సంస్కృతి లేదు..

తెలుగుదేశం పార్టీ పైన వైసీపీ నాయకురాలు షర్మిల చేస్తున్న ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని ఆ పార్టీ నేత రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఓ మహిళను అవమానించే నీచ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పారు. టీడీపీ నేతలపైనే సోషల్ మీడియాలో వైసీపీ అసభ్యకర పోస్టులు పెడుతోందని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఎవరు చేసినా ఖండించాలి..

షర్మిళపై సోషల్ మీడియా ప్రచారానికి, టీడీపీకి సంబంధం లేదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. ఒకరిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తమ అధినేత చంద్రబాబు ప్రోత్సహించరన్నారు. జగన్‌ను రాజకీయంగా విమర్శించామే తప్ప, షర్మిళ ప్రస్తావన తామెప్పుడూ తీసుకురాలేదన్నారు. వ్యక్తిగత ఆరోపణలు ఏ పార్టీ వాళ్లు చేసినా ఖండించాల్సిందేనని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos