శాసనసభ సమావేశాలకు పారికర్..‌

శాసనసభ సమావేశాలకు పారికర్..‌

పనాజి: క్లోమ క్యాన్సర్‌ కారణంగా గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ కొంత కాలంగా తన ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న మూడు రోజుల శాసనసభ సమావేశాలకు ఆయన హాజరవుతారని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ మూడు రోజులూ ఆయన సభకు హాజరవుతారని అన్నారు. ఈ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయని చెప్పారు. రెండో రోజు సభలో.. ఐదు నెలలకుగానూ ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ (తాత్కాలిక బడ్జెట్‌) తీర్మానాన్ని ప్రవేశపెడతారని తెలిపారు. మొదటి రోజు సభలో గవర్నర్‌ మృదుల సిన్హా ప్రసంగం ఉంటుందని వివరించారు. అలాగే, గత ఏడాది జూన్‌ నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న భాజపా ఎమ్మెల్యే పాండురంగ మద్కైకర్‌ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయని సావంత్‌ వెల్లడించారు. ‘ఈ సమావేశాలకు పాండురంగ హాజరుకారంటూ ఆయన కార్యాలయం నుంచి మాకు ఇప్పటివరకు ఎటువంటి సందేశం రాలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభలో చర్చించడానికి ఆ రాష్ట్ర స్పీకర్‌ కార్యాలయం సభ్యుల నుంచి 419 ప్రశ్నలు అందుకుంది. అందులో 137 ప్రశ్నలు స్టార్‌మార్క్‌ (ముఖ్యమైన)కాగా, 282 సాధారణ ప్రశ్నలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. చాలా కాలం తరువాత పారికర్ పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతేడాది నుంచి గోవా, ముంబయి, న్యూయార్క్‌, దిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఆయన క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌ నుంచి గతేడాది అక్టోబర్‌లో డిశ్చార్జ్‌ అయినప్పటి నుంచి ఆయన.. గోవాలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ఆయన చాలా అరుదుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత వారం ఆయన రాష్ట్రంలోని వ్యాపార సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos