శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత

కేరళ: శబరిమలలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఈరోజు ఉదయం ఇద్దరు మహిళలు ప్రయత్నించడం అక్కడ వాతావరణాన్ని వేడెక్కించింది. పంబా బేస్ క్యాంప్ నుంచి నీలమల వచ్చిన వారిద్దరినీ భక్తులు చుట్టుముట్టారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. శబరిమల ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన 9 మంది మహిళా బృందంలో ఈ ఇద్దరు ఉన్నారు. మిగిలిన వారిని పంబా వద్దే భక్తులు అడ్డుకున్నారు. అయితే ఈ ఇరువురు మాత్రం మరింత ముందుకు రాగలిగారు. భక్తుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఇరువురు మహిళలను అక్కడి నుంచి వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వచ్చామని తాము అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి తీరుతామని పట్టుబట్టడంతో కొంతసేపు గందరగోళం తలెత్తింది. 10 నుంచి 50 ఏళ్ల వయస్సున్న బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు గత సెప్టెంబర్ 28న తీర్పు చెప్పింది. దాంతో అప్పటి నుంచి అనేక మంది మహిళలు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు విఫలయత్నం చేశారు. జనవరి 2న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు మాత్రం పోలీసుల రక్షణతో ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. అయితే ఈ ఘటన కేరళాను అట్టుడికించింది. ఇక తాజాగా మరో ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం పరిస్థితిని మరింత దిగజార్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos