శబరిమలలో ప్రవేశించిన మహిళలపై సుప్రీం సంచలన నిర్ణయం

శబరిమలలో ప్రవేశించిన మహిళలపై సుప్రీం సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలకు నిరంతర భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన కారణంగా తమ ప్రాణాలకు ముప్పు వాటినట్టు ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ నెల 2న కనకదుర్గ, బిందు అనే 40 ఏళ్ల ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం కేరళలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకారుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ సదరు మహిళలు ఆరోపించారు. తమకు నిరంతర భద్రత కల్పించాలనీ..  మహిళలు ప్రవేశించిన తర్వాత ‘ఆలయ శుద్ధి’ కార్యక్రమం చేపట్టరాదని తమ పిటిషన్‌లో కోరారు. రాజ్యాంగంలో 21వ అధికరణం ప్రకారం ఇలా ఆలయశుద్ధి జరపడం తమ ప్రతిష్టకు భంగం కలిగించడమేనని వాదించారు. యుక్త వయస్సు వయసు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ఎలాంటి అడ్డంకులూ సృష్టించకుండా అన్ని విభాగాల అధికారులను ఆదేశించాలనీ.. అయ్యప్ప ఆలయాన్ని సందర్శించగోరిన మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్.. ఆలయ శుద్ధి చేపట్టరాదంటూ ప్రధాన అర్చకుడికి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. కనకదుర్గ, బింధులకు కేరళ ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆదేశించారు. మరోవైపు మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటి వరకు 51 మంది యుక్త వయసు మహిళలు శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నట్టు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. వందల ఏళ్లుగా అయ్యప్ప సన్నిధిలో 10 నుంచి 50 లోపు మహిళలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబర్ 28న ఐదుగురు సభ్యులు గల ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాగా బింధు, కనకదుర్గ ఆలయ ప్రవేశం నేపథ్యంలో పూజారులు ఆ రోజు ఆలయాన్ని మూసివేసి ‘శుద్ధి’ చేపట్టిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos