వైఎస్ జగన్‌‌కు మరో తలనొప్పి.. ఎలమంచిలి వైసీపీలో ముసలం!

వైఎస్ జగన్‌‌కు మరో తలనొప్పి.. ఎలమంచిలి వైసీపీలో ముసలం!

ఎలమంచిలి నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. పార్టీ నేతల మధ్య విభేదాలు రోజు రోజుకీ ముదురుతున్నాయి. సమన్వయకర్త కన్నబాబురాజుతో కలిసి పనిచేయలేమని, ఆయనను మార్చాల్సిందేనని బొడ్డేడ ప్రసాద్‌, ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు డిమాండ్‌ చేస్తున్నారు. కన్నబాబురాజు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బొడ్డేడ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీలో వున్నప్పుడు తనపై కేసులు పెట్టించి, ఇబ్బందుకు గురిచేసిన వ్యక్తితో ఎలా కలిసి పనిచేస్తానని మరో నేత ప్రగడ నాగేశ్వరరావు అంటున్నారు. ఎలమంచిలి నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా వున్న విభేదాలు బట్టబయలు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుకు, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే వున్న బొడ్డేడ ప్రసాద్‌, ప్రగడ నాగేశ్వరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. పార్టీలో చేర్చుకోవడమే కాకుండా అప్పటి వరకు సమన్వయకర్తగా వున్న తనను తొలగించి, ఆ పదవిని కన్నబాబురాజుకు ఇవ్వడాన్ని ప్రసాద్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా, పార్టీ కార్యక్రమాలను, కార్యకర్తల సమావేశాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా బొడ్డేడ ప్రసాద్‌తో విభేదిస్తూ వస్తున్న ప్రగడ నాగేశ్వరరావు…. గతంలో కన్నబాబురాజు తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించారంటూ బొడ్డేడతో చేతులు కలిపారు. దీంతో ఇరువురు నేతల అనుచరులు కూడా ఒకే తాటిపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం మునగపాక మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలతోపాటు వారి అనుచరులు కూడా పార్టీ సమన్వయకర్తపై తమ ఆక్రోశాన్ని, అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. తమను చిన్నచూపు చూస్తున్నారని, దీంతో మనోభావాలు దెబ్బతింటున్నాయని కార్యకర్తలు ఆవేదన చెందారు. ఆయనతో(కన్నబాబురాజు) కలిసి పనిచేయలేమని, సమన్వయకర్తను మార్చే విషయాన్ని పరిశీలించాలని అధిష్ఠానానికి సూచించారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించని పక్షంలో తగిన నిర్ణయం తీసుకుందామని బొడ్డేడ ప్రకటించారు. కన్నబాబురాజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనపై పలు కేసులు పెట్టి అవమానించారని, అలాంటి వ్యక్తితో ఇప్పుడు ఎలా కలిసి పనిచేస్తామని మరో నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రగడ నాగేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. ఆది నుంచీ గ్రూపులే..ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీలో ఆది నుంచీ గ్రూపులు గోలే వుంది. ప్రస్తుత సమన్యకర్త కన్నబాబురాజు వైసీపీలో చేరకముందు బొడ్డేడ ప్రసాద్‌, ప్రగడ నాగేశ్వరావు ఉప్పు, నిప్పుగా వుండేవారు. పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించేవారు. గత ఎన్నికల్లో ఓడిపోయని ప్రగడను నియోజకవర్గం సమన్వయకర్తగా అధిష్ఠానం నియమించింది. అయితే ఏడాదిన్నర క్రితం అతనిని తొలగించి, బొడ్డేడ ప్రసాద్‌కు పగ్గాలు అప్పగించింది. దీంతో ఇద్దరిమధ్య విభేదాలు మరింత ముదిరాయి. గత ఎన్నికల్లో తమ నేత ఓటమికి కారణమైన వ్యక్తిని సమన్వయర్తగా నియమించడం ఏమిటని ప్రగడ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరూ కలిసి పార్టీ అభివృద్ధికి పనిచేయాలని అధినేత జగన్‌ చెప్పినా పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఆయన కుమారుడు సుకుమారవర్మ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అంతేకాక సమన్వయర్తగా వున్న బొడ్డేడ ప్రసాద్‌ను తప్పించి, కన్నబాబురాజును నియమించింది. దీంతో పాత ప్రత్యర్థులు బొడ్డేడ, ప్రగడ ఒక్కటయ్యారు. జగన్‌ విశాఖ జిల్లాలో పాదయాత్రకు ముందు మునగపాకలో విజయ్‌సాయిరెడ్డి సమక్షంలోనే బొడ్డేడ, కన్నబాబు వర్గాలు గొడవ పడ్డాయి. జగన్‌ పాదయాత్ర తరువాత కూడా వర్గపోరు తగ్గలేదు. జగన్‌ జన్మదిన వేడుకలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా వేర్వేరుగా జరుపుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిష్ఠానం రంగంలోకి దిగి, బొడ్డేడ ప్రసాద్‌, ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులను శాంతపరచకపోతే వైసీపీకి తీవ్రనష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos