వర్మలా మారుతున్న మెగా బ్రదర్

  • In Film
  • January 25, 2019
  • 791 Views
వర్మలా మారుతున్న మెగా బ్రదర్

ఎప్పుడూ లేనిది ఆన్ లైన్ లో మెగా బ్రదర్ నాగబాబు దూకుడు పెంచుతున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తున్న సమయంలో ఈయన వ్యవహార శైలి రాజకీయ వర్గాలతో పాటు సినిమా సర్కిల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ సినిమాలు జబర్దస్త్ షోలు టీవీ సీరియల్స్ అంటూ తన మానన తానుండే నాగబాబు కొత్తగా యు ట్యూబ్ లో నా ఛానల్ నా ఇష్టం అంటూ పొలిటికల్ కామెంట్స్ చేస్తున్న వీడియోస్ పెట్టె పనిలో పడ్డాడు. ఇది మెగా ఫ్యాన్స్ కు బాగానే కనెక్ట్ అయ్యే వ్యవహారమే కాని అసలు నాగబాబు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేదే భేతాళ ప్రశ్న. మొన్నటిదాకా బాలకృష్ణను టార్గెట్ చేసి కామెంట్స్ పేరుతో ఆరు వీడియోల రచ్చ చేసాడు. నిన్న ఈ ఛానల్ లో లోకేష్ ను ఉద్దేశించి మీ పార్టీలో కులాలు లేవు కదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు జగన్ ని టార్గెట్ చేస్తున్నాడు. తప్పు ఎవరు చేసినా మాట ఎవరు తప్పినా మమ్మల్ని ఎవరు కామెంట్ చేసినా నిలదీస్తాను అంటున్న నాగబాబు మరి అందరి విషయంలోనూ ఇలాగే ఉంటాడా అనేది చెప్పాల్సి ఉంది.గతంలో పవన్ ఎన్నికల సమయంలో చంద్రబాబు మోడీలను ఆకాశానికెత్తిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరు సైతం ప్రజా రాజ్యం టైంలో ప్రత్యర్థుల మీద విమర్శలు గట్టిగానే చేసారు. వాటి తాలుకు వీడియోలు అందుబాటులోనే ఉన్నాయి. నాగబాబు ఒకవేళ నిజాయితిగా అందరిని ప్రశ్నించాలి అంటే ముందు తన ఇంటి నుంచే మొదలు పెడతాడా అనేది అంతు చిక్కని ప్రశ్న.ఏదో పార్టీ ప్రమోషన్ కోసం అన్నట్టు ఇదంతా కనిపిస్తున్నా ఒక వైపే మాట్లాడే పనుల వల్ల నాగబాబుకు పార్టీకి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. రోజా టిడిపిలో ఉన్నప్పుడు చిరు పవన్ లను దారుణంగా దుమ్మెత్తిపోసారు. నాగబాబు వాటిని ఇప్పుడు ప్రస్తావనలోకి తీసుకురాగలడా. ఏదో సెన్సేషన్ కోసమన్నట్టు మొదట్లో ఇదంతా బాగానే ఉంటుంది కాని మనకన్నా తలలు పండిన ప్రత్యర్థులు ఉన్నారని నాగబాబు గుర్తిస్తే ఇకపైనైనా జాగ్రత్తగా ఉండొచ్చు. లేకపోతే రాను రాను మరో ఆర్జివి వచ్చాడు అనే కామెంట్స్ సోషల్ మీడియా నుంచి వచ్చినా వస్తాయి

తాజా సమాచారం