వచ్చే ఏడాదే బజాజ్‌ ‘ఎలక్ట్రిక్‌’ ఎంట్రీ

  • In Money
  • January 22, 2019
  • 774 Views
వచ్చే ఏడాదే బజాజ్‌ ‘ఎలక్ట్రిక్‌’ ఎంట్రీ

న్యూఢిల్లీ: ఎప్పుడెపుడా అని ఎదురు చూస్తున్న వేళ… వచ్చే ఏడాదే ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి ప్రవేశించనున్నట్టు బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ప్రకటించారు. బీఎస్‌–6 కాలుష్య విడుదల నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాల ఇంజన్లను మార్చడంతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి ప్రవేశం కూడా వచ్చే ఏడాది ఉంటుందన్నారు. ‘‘ఎలక్ట్రిక్‌ క్యూట్, ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలు (ఆటోలు) తమ ఎజెండాలో ముందున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌–6 ప్రమాణాలకు అనుగుణంగా మా పెట్రోల్, డీజిల్‌ ఇంజన్లను రూపొందించనున్నాం’’ అని రాజీవ్‌  తెలిపారు. కేటీఎంకు చెందిన హస్క్‌వర్న మోటారు సైకిల్‌ బ్రాండ్‌ను భారత మార్కెట్లోకి ఈ ఏడాదే తీసుకురానున్నట్టు రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. బజాజ్‌ ఆటో తన నాలుగు చక్రాల క్యూట్‌ (క్వాడ్రిసైకిల్‌)ను ఇప్పటికే 20 దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయం గమనార్హం. 

మార్చిలో దేశీయ రోడ్లపైకి క్యూట్‌
భారత్‌లో క్యూట్‌ను ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న ప్రశ్నకు… మార్చిలో జరగొచ్చని బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ తెలిపారు. తుది అనుమతుల ప్రక్రియలో ఉందన్నారు. బజాజ్‌ ఈ స్కూటర్‌..: ఎలక్ట్రిక్‌ క్యూట్, మూడు చక్రాల ఎలక్ట్రిక్‌ వాహనాలు తమ అజెండాలో ముందున్నట్టు రాజీవ్‌ బజాజ్‌ ప్రకటించారు. అయితే, బజాజ్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ఈ స్కూటర్‌ కూడా రానుందని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ‘‘బజాజ్‌ నుంచి మీరు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను అంచనా వేస్తున్నట్టయితే అది ఈ రోజు సాధ్యపడదు. కానీ, త్వరలోనే ఇది జరగనుంది’’ అని రాజీవ్‌  చెప్పారు. 

‘ది వరల్డ్‌ ఫేవరెట్‌ ఇండియన్‌’
దేశీయ సంస్థ బజాజ్‌ ఆటో 17 ఏళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో సాధించిన పురోగతిపై ‘ద వరల్డ్‌ ఫేవరెట్‌ ఇండియన్‌’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.  రాజీవ్‌ బజాజ్‌ సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్విచక్రవాహన ఎగుమతుల్లో బజాజ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, సంస్థ ఆదాయంలో 40% విదేశీ మార్కెట్ల నుంచే వస్తున్నట్టు చెప్పారు. 70 దేశాల్లో 15 మిలియన్ల వాహనాల అమ్మకాలతో కేంద్ర ప్రభుత్వ ఆకాంక్ష అయిన ‘మేకిన్‌ ఇండియా’కు చిరునామాగా బజాజ్‌ నిలిచిందని రాజీవ్‌ వివరించారు. గత పదేళ్లలో సంస్థ 13 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos