రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య

  • In Crime
  • January 22, 2019
  • 773 Views
రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య

రైలు కింద పడి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామ సమీపంలో సోమవారం వేకువజామున చోటు చేసుకుంది. బొబ్బిలి పట్టణం జగన్నాథపురానికి చెందిన సీహెచ్‌ చంద్రశేఖర్‌ (21), కె.కృష్ణవేణి(19) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతికి ఇటీవలే వేరే యువకుడితో పెళ్లి కుదిరింది. బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె పార్వతీపురంలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అక్కడకు చేరుకున్నాక కొంత సమయం అనంతరం కృష్ణవేణి కన్పించడం లేదని పెళ్లి కుమారుడు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో అంతా కలిసి రాత్రి వరకు గాలించారు. అనంతరం విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున.. చంద్రశేఖర్‌, కృష్ణవేణిలు రైలు పట్టాలపై విగతజీవులుగా పడిఉన్నట్టు స్థానికులు గుర్తించారు. కాగా, చంద్రశేఖర్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్‌ రాతపరీక్ష కూడా రాశాడు. ఆయన తండ్రి చనిపోవడంతో తల్లే కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. యువతి తల్లిదండ్రులూ  కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రేమ ఫలించదనే భయంతోనే చంద్రశేఖర్‌, కృష్ణవేణిలు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. రైల్వే హెచ్‌సీ రాజ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos