రైతులకు కొత్త పేరు పెట్టిన మోదీ

రైతులకు కొత్త పేరు పెట్టిన మోదీ

న్యూఢిల్లీ : రైతులకు తన ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మునుపటి ప్రభుత్వాలు రైతులను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. రైతు సంక్షేమం కోసం తన ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతు సమస్యల పరిష్కారానికి, వారిని సాధికారులను చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల పాపాలను ప్రక్షాళన చేయడం సాధ్యం కాదన్నారు. రైతులను గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే పరిగణించాయన్నారు. తమ దృష్టిలో రైతులంటే శక్తి దాతలని మోదీ చెప్పారు. రైతులకు ప్రతి అడుగులోనూ సహాయపడుతున్నామని, ఇది నిరంతర, నిలకడైన ప్రక్రియ అని తెలిపారు. వీటి ఫలితాలు దీర్ఘకాలికంగా కనిపిస్తాయని చెప్పారు. కనీస మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్ దశాబ్దాల నుంచి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెరగనివ్వలేదని రైతులకు తెలుసునని పేర్కొన్నారు. కానీ తన ప్రభుత్వం రైతుల డిమాండ్లను వాస్తవ రూపానికి తీసుకొచ్చినట్లు తెలిపారు.మనమంతా అభివృద్ధి లక్ష్యం వైపు కలిసికట్టుగా కదలాలని మోదీ పిలుపునిచ్చారు. రైతులు భూమిని దున్నినట్లుగానే, మనమంతా రాజకీయ క్షేత్రాన్ని దున్నాలన్నారు. ప్రతి కుటుంబాన్ని కలుసుకుంటూ, వారిని క్షేత్రస్థాయి కార్యకర్తలుగా చేసుకుంటూ మనం (బీజేపీ) అదే పని చేస్తున్నామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos