రైటర్ టర్న్ డ్ డైరెక్టర్స్..ఏమయ్యారు?

  • In Film
  • January 25, 2019
  • 147 Views
రైటర్ టర్న్ డ్ డైరెక్టర్స్..ఏమయ్యారు?

హిట్టు – ఫ్లాపు అనేవి ప్రేక్షక దేవుళ్లపై ఆధారపడి ఉంటుంది. చేసినది చిన్న తప్పు అయినా మూల్యం పెద్దగా ఉంటుందిక్కడ. సెంటిమెంటు పరిశ్రమలో హిట్టు ఒక్కటే కెరీర్ ని డిసైడ్ చేస్తుంది. ఆ ఒక్క హిట్టు దక్కకపోతే బ్యాక్ బెంచీకే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే హిట్టు – ఫ్లాపుతో సంబంధం లేకుండా రైటింగ్ స్కిల్ తో నెగ్గుకొచ్చే దర్శకులు కొందరు పరిశ్రమలో ఉంటారు. రైటర్ టర్న్ డ్ డైరెక్టర్లకు ఇదో రకం అడ్వాంటేజ్ అనే చెప్పాలి. దర్శకుడిగా ఫెయిలైనా రైటర్లుగా ఉండే అనుభవం – తమ స్నేహాల వల్లనూ ఇక్కడ మ్యానేజ్ చేయడం కష్టమేమీ కాదు. ఆ కోవలో పరిశీలిస్తే ఫ్లాపు తర్వాత ఓ నలుగురు  రైటర్ టర్న్ డ్ డైరెక్టర్ల సన్నివేశం ఎలా ఉంది? అన్నది పరిశీలిస్తే..

కొందరు నవతరం దర్శకులు ఫ్లాపు వల్ల కెరీర్ పరంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ రైటర్ వక్కంతం వంశీ `నా పేరు సూర్య` చిత్రానికి దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నం డిజాస్టర్ అవ్వడంతో ఆ తర్వాత మరో సినిమా తీసే ఛాన్స్ రాలేదు. అయితే రైటర్ గా ఆయన స్టామినాకి తగ్గ అవకాశాలకు కొదవేం లేదని తెలుస్తోంది. ఇక ఆరంభమే `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` లాంటి బ్లాక్ బస్టర్ తీసిన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత `ముకుంద` చిత్రంతో ఫర్వాలేదనిపించాడు. మూడో ప్రయత్నం మాత్రం బెడిసి కొట్టింది. `బ్రహ్మోత్సవం` పేరుతో డిజాస్టర్ సినిమా తీయడంతో తదుపరి సినిమాకి ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. మహేష్- శ్రీకాంత్ అడ్డాల కాంబో `బ్రహ్మోత్సవం` రిలీజై చాలా కాలమే అయినా ఇప్పటికీ కొత్త సినిమాని ప్రారంభించలేదు. అతడు ప్రస్తుతం తదుపరి సినిమాని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. `కూచిపూడి వారి వీధి` అనే క్లాసిక్ టైటిల్ ని ఎంపిక చేసుకున్నాడు. స్క్రిప్టు ఇప్పటికే రెడీ అయ్యింది. అయితే హీరో కోసం చాలా కాలంగానే వెయిటింగ్ లో ఉన్నారట. ఇతర ఆర్టిస్టుల ఎంపికలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలు – స్క్రిప్టు వర్క్ అందించిన సతీష్ వేగేష్న దర్శకుడిగా మారి `శతమానం భవతి` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో డెబ్యూ సినిమాతో గ్రేట్ ఫీట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత అదే బ్యానర్ లో తెరకెక్కించిన రెండో సినిమా `శ్రీనివాస కల్యాణం` డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆ ప్రభావం అతడి కెరీర్ పైనా పడింది. ప్రస్తుతం వేగేష్న సతీష్ తదుపరి చిత్రానికి స్క్రిప్టు రెడీ చేసుకుని లాంచింగ్ కోసం వేచి చూస్తున్నాడు. హీరో ఎవరో తేలలేదింకా. ప్రముఖ బ్యానర్ చిత్రీకరణకు రెడీగా ఉంది. `ఆల్ ఈజ్ వెల్` అనే టైటిల్ వినిపిస్తోంది. త్వరలోనే అన్ని వివరాల్ని ప్రకటిస్తారట. ఇక రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా ప్రయత్నించినా ఎందుకనో ఆశించిన రిజల్ట్ దక్కలేదు. అతడు రైటర్ గానే కొనసాగుతున్నారు. మరింత మంది నవతరం కుర్రాళ్లు రచయితలుగా సక్సెసై దర్శకులయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే హిట్టును నమ్మే పరిశ్రమలో బ్యాక్ బెంచీలో పడకుండా జాగ్రత్తగా కెరీర్ ని పకడ్భందీగా ప్లాన్ చేస్కోవాల్సి ఉంటుంది.

తాజా సమాచారం