రూ.3.73 లక్షల కోట్లు

రూ.3.73 లక్షల కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలో మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్ రంగం శరవేగంగా పుంజుకుంటున్నది. 2022 నాటికి ఈ రంగం 52,683 మిలియన్ డాలర్లకు చేరుకోనుందని ఒక సర్వే వెల్లడించింది. మన కరెన్సీలో ఇది రూ.3.73 లక్షల కోట్లు. రోజురోజుకు సంపాదన పెరుగుతుండటం, జనాభా, అన్ని ఫార్మెట్లలో కంటెంట్ వినియోగం ఊపందుకోవడం ఈ రంగం పుంజుకోవడానికి ప్రధాన కారణమని అసోచామ్-పీడబ్ల్యూసీ సంయుక్త సర్వే విశ్లేషించింది. సంప్రదాయక మీడియాలో టీవీ, సినిమాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒవర్-ది-టాప్(ఓటీటీ) సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. వచ్చే నాలుగేండ్లకాలంలో దేశీయ వీడియో ఓటీటీ మార్కెట్… టాప్-10 ప్రపంచ మార్కెట్లో ఒకటిగా ఉండనున్నదని తెలిపిన సర్వే..2022 నాటికి ఓటీటీ మార్కెట్ 823 మిలియన్ డాలర్లకు(రూ.5,363 కోట్లు) ఎగబాకనున్నదని పేర్కొంది. 2017లో 11.7 శాతం వృద్ధితో 30,364 మిలియన్ డాలర్లుగా ఉన్న మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ..2022 నాటికి 52,683 మిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని నివేదిక అంచనావేస్తున్నది. ప్రతియేటా సగటున రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని పేర్కొంది. వచ్చే నాలుగేండ్లలో కూడా మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో టీవీ, సినిమా, ఓటీటీల వాటా 46 శాతంగా ఉండనున్నదని తెలిపింది. ఓటీటీ సేవలతోపాటు వీడియో-ఆన్-డిమాండ్(వీవోడీ)లు కీలకపాత్ర పోషిస్తున్నాయని, అలాగే ప్రొడక్షన్ బడ్జెట్ కంపెనీలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లు సంప్రదాయక స్టూడియోలను ఏర్పాటు చేయడం కూడా పోటీ మరింత పెరుగడానికి ప్రధాన కారణమని పీడబ్ల్యూసీ ఇండియా పార్టనర్ ఫ్రాంక్ డీసౌజా తెలిపారు.

సర్వేలోని పలు ముఖ్యాంశాలు..

-అంతర్జాతీయంగా ఓటీటీ మార్కెట్ 10.1 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నది.
-భారత్ విషయానికి వస్తే 297 మిలియన్ డాలర్ల(రూ.1,932 కోట్లు) నుంచి 823 మిలియన్ డాలర్లకు(రూ.5,363 కోట్లు) చేరుకోనున్నది. సగటున 22.6 శాతం వృద్ధి నమోదవనున్నది.
-వీటిలో వీవోడీ చందదారులు కీలకపాత్ర పోషించనున్నారు. గడిచిన పదేండ్లలోప్రపంచవ్యాప్తంగా వీవోడీకి మంచి డిమాండ్ నెలకొన్నది. 
-భారత్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న మొబైల్ వీడియో అడ్వైర్టెజింగ్ సగటున 32.8 శాతం వృద్ధితో 317 మిలియన్ డాలర్లకు(రూ.2,064 కోట్ల) చేరుకోనుందన్న అంచనా.
-డాటా వినిమయం 71,67,103 మిలియన్ల మెగాబైట్ల నుంచి 10,96,58,793 మిలియన్ మెగాబైట్లకు చేరుకోనున్నది. 
-డాటా టారిఫ్ ధరలు తక్కువగా ఉండటం, స్మార్ట్‌ఫోన్ల వినిమయం ఊపందుకోవడంతో వీవోడీ అభివృద్ధిదారులకు ప్రయోజనం చేకూరనున్నది. 
-తలసరి భారతీయుడిపై పెట్టే ఖర్చు 32 డాలర్లకు చేరుకోనున్నది. ఇది చైనాలో పెడుతున్న 222 డాలర్‌తో పోలిస్తే చాలా తక్కువ.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos