రిటైల్‌.. మొబైల్‌.. మీడియాల్లో.. ముకేశ్‌ హవా!

  • In Money
  • January 9, 2019
  • 807 Views

మార్కెట్‌ విలువ రూ.21 లక్షల కోట్లకు
2027కు సాకారం: ఎలారా క్యాపిటల్‌
ముంబయి:రిటైల్‌, టెక్నాలజీ (మొబైల్‌), ప్రసార మాధ్యమాలు-వినోదం (మీడియా) రంగాల్లో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మరింత దూసుకెళ్లనుంది. ప్రస్తుతం రూ.7 లక్షల కోట్లకు పైగా మార్కెట్‌ విలువ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వచ్చే దశాబ్దంలో దేశంలోనే అగ్రగామి వినియోగదారు సంస్థగా అవతరించే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ ఎలారా క్యాపిటల్‌ తాజా నివేదికలో పేర్కొంది. 2027కు సంస్థ మార్కెట్‌ విలువ 300 బిలియన్‌ డాలర్లకు (రూ.21 లక్షల కోట్లకు పైగా) చేనే అవకాశం ఉందని తెలిపింది. అమెరికాకు చెందిన ‘ఫాంగ్‌’ (ఎఫ్‌ఏఏఎన్‌జీ) స్టాక్స్‌ సరసన ఆర్‌ఐఎల్‌ చేరొచ్చన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో అత్యంత ప్రముఖమైన, ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్న అయిదు సాంకేతిక దిగ్గజ సంస్థలైన ఫేస్‌బుక్‌ (ఎఫ్‌), యాపిల్‌ (ఏ), అమెజాన్‌ (ఏ), నెట్‌ఫ్లిక్స్‌ (ఎన్‌), గూగుల్‌ (జీ)లను ఫాంగ్‌ స్టాక్స్‌గా పిలుస్తుంటారు. ఇదే తరహాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశీయంగా అతిపెద్ద వినియోగదారు సంస్థగా అవతరిస్తుందన్న ఎలారా క్యాపిటల్‌ నివేదికలో ఇంకా ఏముందంటే..
* ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దూరదృష్టి, తెలివితేటల్ని ప్రశంసించి తీరాల్సిందే. ఆయన సారథ్యంలో సంస్థ మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయం. దీన్ని విస్మరిస్తే మదుపరులు లాభాలు కోల్పోయే అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) హరేంద్ర కుమార్‌ తమ ఖాతాదారులకు రాసిన నోట్‌లో పేర్కొన్నారు.
* రిలయన్స్‌ రిటైల్‌, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, మీడియా కంపెనీల సాయంతో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వినియోగదార్ల పరంగా అగ్రగామి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌)ను అధిగమించడానికి ఎంతో కాలం పట్టదు. ప్రస్తుతం అతి పెద్ద ఎంఎఫ్‌సీజీ సంస్థగా కొనసాగుతున్న హెచ్‌యూఎల్‌కు 70 కోట్ల మంది వినియోగదారులున్నారు.
* ఆర్‌ఐఎల్‌ వద్ద కొన్ని మంచి బ్రాండ్లు ఉన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు వీటిని కొనేందుకు ప్రస్తుతం ఆసక్తి చూపిస్తున్నారు.
* ఆర్‌ఐఎల్‌ తమ సంప్రదాయ చమురు ఉత్పత్తి, శుద్ధి వ్యాపారంపై ప్రస్తుతం ఎక్కువగా లాభాలు ఆర్జిస్తోంది. రిటైల్‌, టెలికాం వ్యాపారాలు ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. వచ్చే అయిదేళ్లలో ఇవి గణనీయంగా వృద్ధి చెంది ఆర్‌ఐఎల్‌ స్టాక్‌ 24 శాతం వరకు ప్రతిఫలం అందించే అవకాశం ఉంది.
* వినియోగదారు కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరిగితే, కమొడిటీ మార్కెట్‌ నుంచి వీటిని విడదీసే అవకాశం కూడా కనిపిస్తోంది.
* ఆర్‌ఐఎల్‌ నిర్వహిస్తున్న వినియోగదారు వ్యాపారం నుంచి రూ.లక్ష కోట్ల నిర్వహణ లాభం ఆర్జించాలనేది ముకేశ్‌ అంబానీ లక్ష్యం. దీన్ని వచ్చే దశాబ్దంలో (2027 నాటికి) చేరుకోగలరని అనిపిస్తోంది. ప్రస్తుతం అలీబాబా ఆర్జిస్తున్న లాభానికి ఇది దగ్గరగా ఉంది.
* ముకేశ్‌ ఆశించినట్లు జరిగితే ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ ప్రస్తుత స్థాయి 100 బిలియన్‌ డాలర్ల నుంచి మూడు రెట్లకు (300 బి.డాలర్లు- రూ.21 లక్షల కోట్లు) పెరిగే అవకాశం కనిపిస్తోంది.
* బీఎస్‌ఈలో మంగళవారం ఆర్‌ఐఎల్‌ షేరు 0.05 శాతం లాభంతో రూ.1103.95 వద్ద ముగిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos