మోన్‌శాంటోకు సుప్రీంలో ఊరట

  • In Money
  • January 9, 2019
  • 792 Views

బీటీ పత్తి విత్తనాలపై సంస్థ పేటెంట్లు చెల్లవన్న హైకోర్టు తీర్పును పక్కనపెట్టిన ధర్మాసనం
——————————————————————
దిల్లీ: జన్యు మార్పిడి బీటీ రకం పత్తి విత్తనాలపై మోన్‌శాంటో సంస్థకున్న పేటెంట్లు చెల్లవంటూ దిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. మోన్‌శాంటో, బేయర్‌, డుపాంట్‌ పయోనీర్‌ సహా భారత్‌లో జన్యు మార్పిడి పంటలపై తమకున్న పేటెంట్లను కోల్పోతామన్న ఆందోళనలో ఉన్న వివిధ అంతర్జాతీయ సంస్థలకు ఇది ఊరటనిచ్చే పరిణామం. మహికో మోన్‌శాంటో బయోటెక్‌-ఇండియా (ఎమ్‌ఎమ్‌బీ) పేరుతో నెలకొల్పిన సంస్థ ద్వారా భారత్‌కు మోన్‌శాంటో బీటీ విత్తనాలను తీసుకువచ్చింది. దేశంలోని 40కి పైగా విత్తన సంస్థలు మోన్‌శాంటో నుంచి లైసెన్సు పొంది బీటీ విత్తనాలను విక్రయిస్తున్నాయి. ఇదే తరహాలో నూజివీడు సీడ్స్‌ సంస్థతో మహికో మోన్‌శాంటోకు ఉన్న లైసెన్స్‌ ఒప్పందం 2015లో రద్దైంది. అయితే ఆ తర్వాత కూడా తాము పేటెంట్‌ పొందిన బీటీ పత్తి విత్తనాల విక్రయాలను నూజివీడు సీడ్స్‌ కొనసాగించిందని పేర్కొంటూ ఆ సంస్థపై మోన్‌శాంటో దిల్లీ హైకోర్టులో దావా వేసింది. భారత పేటెంట్‌ చట్టం ప్రకారం జన్యు మార్పిడి పత్తి విత్తనాలపై మోన్‌శాంటోకున్న పేటెంట్లు చెల్లవంటూ నూజివీడు సీడ్స్‌ అప్పుడు కోర్టులో వాదించింది. తీర్పు మోన్‌శాంటోకు ప్రతికూలంగా వచ్చింది. దీనిపై మోన్‌శాంటో అప్పీలుకు వెళ్లింది. దిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తాజాగా కొట్టివేసింది. తమ మేధోహక్కులను నూజివీడు సీడ్స్‌ ఉల్లంఘించిందని మోన్‌శాంటో చేసిన ఆరోపణలపైనా దిల్లీ హైకోర్టు విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. పేటెంట్‌ నిబంధనల విషయంలో అనిశ్చితి కారణంగా భారత్‌లో నూతన సాంకేతికత విడుదలను చాలా సంస్థలు నిలిపివేశాయని.. సుప్రీం తాజా ఆదేశం వల్ల రైతులకు మేలు కలుగుతుందని ‘షెట్కారీ సంఘటన’ రైతు సంఘం నాయకుడు అజిత్‌ నార్డే అన్నారు. మోన్‌శాంటోను జర్మనీకి చెందిన బేయర్‌ ఏజీ సంస్థ ఏడు నెలల క్రితం కొనుగోలు చేసింది. భారత్‌లో పత్తి పంట సాగు విస్తీర్ణంలో దాదాపు 90 శాతం వాటా మోన్‌శాంటో బీటీ రకాలదే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos