మోదీ-షా జోడీకి ఇక నిద్రలేని రాత్రులే.

మోదీ-షా జోడీకి ఇక నిద్రలేని రాత్రులే.

లక్నో: దశాబ్దాల రాజకీయ శత్రుత్వాన్ని వెనక్కునెట్టి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్‌పీ సుప్రీం మాయావతి ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో చేతులు కలిపారు. ‘మోదీ-షా జోడికి ఇక నిద్రలేని రాత్రులు’ తప్పవని అఖిలేష్ యాదవ్, మాయావతి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్‌పీ కూటమిగా ఏర్పడినట్టు శనివారంనాడు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో అఖిలేష్, మాయావతి అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ, మాయావతిని అవమానిస్తే తనను అవమానించినట్టేనని, పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎస్పీ-బీఎస్‌పీ కూటమి ఏర్పాటుకు సహకరించిన మాయావతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల బీజేపీ పాలనలో పేదలు, రైతులు, దళితులు, మహిళలు, పిల్లలపై అకృత్యాలు మితిమీరాయని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసిందని దుయ్యబట్టారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, బీజేపీ దురహంకారానికి చరమగీతం పాడేందుకు బీఎస్‌పీ, ఎస్‌పీ చేతులు కలపాల్సిన అనివార్యత ఏర్పడిందని అన్నారు. కార్యకర్తల్లో విభేదాలు సృష్టించేందుకు వాళ్లు (బీజేపీ) ఎంతకైనా తెగిస్తారని, అలాంటి ఎత్తుగడలను సమష్టిగా మనం తిప్పిగొట్టాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. మాయావతిపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఎస్పీతో పొత్తు ఆలోచన తన మనసులో మెదులుతూనే ఉందన్నారు. మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి బీజేపీ మంత్రి పదవులిచ్చిందన్నారు. ఎస్‌పీ కార్యకర్తలంతా మాయావతి పట్ల గౌరవంతో మసలుకోవాలని, మాయావతిని అవమానపరిస్తే తనను అవమానపరిచినట్టేనని అఖిలేష్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos