మోడీ మిత్రుల మధ్య పెట్రో యుద్ధం

  • In Money
  • January 18, 2019
  • 784 Views
మోడీ మిత్రుల మధ్య పెట్రో యుద్ధం

భారతీయ వ్యాపార దిగ్గజాల మధ్య కీలక పోటీకి తెరలేవనుంది. భారతీయ పెట్రోకెమికల్స్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని – అదాని గ్రూప్ అధిపతి గౌతమ్ అదాని ఢీ కొంటున్నారు. జర్మనీకి చెందిన కెమికల్ దిగ్గజం బీఏఎస్ ఎఫ్ ఎస్ ఈతో అదాని భాగస్వామ్యాన్ని ప్రకటించారు. సుమారు రూ.16000 కోట్ల (దాదాపు 2 బిలియన్ యూరోలు) పెట్టుబడితో గుజరాత్ లోని ముంద్రా జిల్లాలో ఓ రసాయన కర్మాగారాన్ని అదాని గ్రూప్ – బీఏఎస్ ఎఫ్ కలిసి నిర్మిస్తున్నాయి. అలాగే ఈ ప్లాంట్ విద్యుత్ అవసరాల కోసం ఇక్కడే ఓ పవన – సౌర విద్యుదుత్పత్తి కేంద్రాన్నీ ఏర్పాటు చేయనున్నారు.  ఈ ఇద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సన్నిహితులనే టాక్ ఉన్న సంగతి తెలిసిందే.వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2019 శుక్రవారం ప్రారంభమవుతున్న క్రమంలో గురువారం ఎంవోయూపై బీఏఎస్ ఎఫ్ ఎస్ ఈ – అదాని గ్రూప్ లు సంతకాలు చేశాయి. అనంతరం ఇరు సంస్థలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేయగా – దాని ప్రకారం కెమికల్ వెంచర్ లో మెజారిటీ వాటా బీఏఎస్ ఎఫ్ కే ఉండనున్నది. అయితే పవర్ వెంచర్ లో మాత్రం అదానిదే అగ్ర వాటా. కానీ ఈ జాయింట్ వెంచర్లకు సంబంధించి ఇరు సంస్థలు పూర్తి వివరాలను తెలియజేయకపోవడంతో ఇంతకుమించి సమాచారం అందుబాటులో లేకుండాపోయింది. అయినప్పటికీ భారత్ లో బీఏఎస్ ఎఫ్ భారీ పెట్టుబడి ఇదేనని మాత్రం తెలుస్తున్నది. బీఏఎస్ ఎఫ్ తో భాగస్వామ్యం మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తుందని – ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న సీ3సహా ఎన్నో రసాయనాలు దేశీయంగానే ఉత్పత్తి కాగలవని ఈ సందర్భంగా మాట్లాడుతూ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదాని అన్నారు.

గుజరాత్కు చెందిన బిలియనీర్ వ్యాపారులు అంబానీ – అదానిలు బహుళ వ్యాపార కార్యకలాపాలతో భారతీయ పారిశ్రామిక రంగంలో బలమైన ముద్రనే వేశారు. అయితే ఎన్నో వ్యాపారాలను వీరిద్దరు చేస్తున్నా.. ఇప్పటిదాకా ఏ రంగంలోనూ ప్రత్యక్షంగా పోటీపడిన దాఖలాల్లేవు. కానీ ఇప్పుడు పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి అదాని రావడంతో తొలిసారి ఓ వ్యాపారంలో ప్రత్యక్షంగా ఈ ఇద్దరు దిగ్గజాలు తలపడబోతున్నారు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ ఐఎల్)లో పెట్రోకెమికల్స్ వ్యాపారానిదే పెత్తనం. అలాంటి ఈ వ్యాపారంలోకే అదాని వస్తుండటం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. అంబానీ ఏకఛత్రాధిపత్యానికి అదాని బ్రేకులు వేస్తారా? అన్నదానిపై మొత్తం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తాజా ఒప్పందం ప్రకారం – అదాని-బీఏఎస్ ఎఫ్ జాయింట్ వెంచర్.. కెమికల్స్ ను తయారు చేయనున్నది. నిర్మాణ – ఆటోమోటివ్ – కోటింగ్స్ వ్యాపారాలకు వీటి సరఫరా ప్రధానంగా ఉండనున్నది. కాగా అంబానీ సంస్థ మాత్రం ప్యాకేజింగ్ – అగ్రికల్చర్ – ఆటోమోటివ్ – హౌజింగ్ – హెల్త్ కేర్ మరికొన్ని వ్యాపారాలకూ సేవలను అందిస్తున్నది. ఆయిల్ టు టెలికం వ్యాపార దిగ్గజంగా పేరున్న రిలయన్స్.. 16 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో చేపట్టిన పెట్రోకెమికల్ ఉత్పాదక సామర్థ్యం విస్తరణ పనులను గతేడాది జనవరిలోనే పూర్తి చేసింది. దీంతో ప్రపంచంలోని టాప్-5 భారీ చమురు శుద్ధి ఉత్పాదకదారుల్లో రిలయన్స్ ఒకటైంది. గుజరాత్ లోని జమ్ నగర్ – హజిరా – దహేజ్ – వడోదర – మహారాష్ట్రలోని నాగోథానేల్లో ఆర్ ఐఎల్ కు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అదాని ఎంట్రీ సర్వత్రా ఆసక్తిదాయకంగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos