మూడు రోజుల సమయమిస్తున్నా..

మూడు రోజుల సమయమిస్తున్నా..

‘‘మూడు
రోజుల సమయం ఇస్తున్నా. పార్లమెంట్‌ వేదికగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఏపీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు’’ అంటూ ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఫ్రభుత్వంపై విరచుకుపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం సోమవారం ఢిల్లీలోని
ఏపీ భవన్‌లో చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడారు.విభజన అనంతరం
తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని,ప్రత్యేక
హోదా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి ఆంధ్రప్రదేశ్‌కు
మరింత అన్యాయం చేసారంటూ ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసమే
తాము పోరాడుతున్నామని కేంద్రం నుంచి భిక్ష కోసం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.విభజన
సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చిన ఏఒక్క హామీ కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.విభజనతో
తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రత్యేక
హోదా తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని విభజన సమయంలో బీజేపీ నేతలే తెలిపారని గుర్తు చేసారు.ఆంధ్రప్రదేశ్‌కు
ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా అవసరమంటూ వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను
బీజేపీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు.విశాఖకు రైల్వేజోన్‌,కడపలో ఉక్కు పరిశ్రమ,రెవెన్యూ
లోటు భర్తీ,రాజధాని నిర్మాణానికి నిధులు ఇలా ఎన్నో హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చాక
ఈ హామీల్లో ఏఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.పైగా ఆంధ్రప్రదేశ్‌
రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకొని రాష్ట్రం గొంతు కోసారంటూ ధ్వజమెత్తారు.

  ‘‘ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే ఇక్కడ దీక్షకు కూర్చున్నా. కేంద్రం అన్యాయం చేసినందుకే పోరాటం చేస్తున్నాం. పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. హక్కుల కోసం మేం పోరాడుతున్నాం. మీ భిక్ష కోసం పోరాడడం లేదు. మీ ఆటలు సాగవని చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. ఐదు కోట్ల ప్రజల కోసం.. భావితరాల భవిష్యత్తు కోసం.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం. ఆంధ్రభవన్‌ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేశాం. అవన్నీ కూడా విజయవంతమయ్యాయి. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తగిన గుణపాఠం చెప్తాం. అద్దె జనాలను పెట్టుకుని రాష్ట్రంపై ప్రధాని మోదీ దాడి చేశారు. కేంద్రం దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. లెక్కలు చెప్పడానికి మేం సిద్ధం. మేం కట్టిన పన్నులకు మీరు లెక్కలు చెప్తారా?  ఇప్పటికైనా మూడు రోజుల సమయం ఉంది. చేసింది తప్పని పార్లమెంట్‌లో ఒప్పుకుంటే ఏపీ ప్రజలు క్షమిస్తారు. లేకుంటే శాశ్వతంగా ఈ భాజపాను, నరేంద్రమోదీని రాష్ట్ర ప్రజలు బహిష్కరిస్తారు. ఏపీ చరిత్రలో మీ పార్టీ అడ్రస్‌ పూర్తిగా గల్లంతు అవుతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

అంతకుముందు సీఎం చంద్రబాబు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ దీక్షకు ఏపీ నుంచి వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు పలు జాతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. వివిధ తెలుగు సంఘాలు, విద్యార్థి సంఘాలు దీక్షకు మద్దతు పలికాయి.

విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఉద్ఘాటించారు. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుందని, అందుకే ఆంధ్రా ప్రజలు ఇక్కడికి వరకు వచ్చారన్నారు. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి పాలించాలని చూస్తున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలన్నారు. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదని హితవు పలికారు. ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos