మాట్లాడాలని రప్పించి…

  • In Crime
  • February 11, 2019
  • 788 Views
మాట్లాడాలని రప్పించి…

వేధింపులు భరించలేక తనను విడిచి దూరంగా ఉంటున్న భార్యను, రెండున్నర నెలల వయసున్న కుమారుడిని మాట్లాడాలంటూ రప్పించి మరీ అంతమొందించాడో దుర్మార్గుడు. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉన్న వారిని.. గొంతు నులిమి చంపేసి, అనంతరం మృతదేహాలను పెట్రోల్‌ పోసి దహనం చేశాడు. తరువాత పోలీసులకు లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగు చూసింది. రాచకొండ కమిషనరేట్‌ ఘట్‌కేసర్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం పూర్వాపరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మచ్చల రమేశ్‌(27) హైదరాబాద్‌లో కార్పెంటర్‌గా పనిచేసేవాడు. వరంగల్‌ గ్రామీణ జిల్లా సంగెం మండలం బొల్లికుంటకు చెందిన కండిగ శుశ్రుత(26) నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో బీఫార్మసీ చదివేది. ఆ సమయంలోనే రమేశ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. కొంతకాలం సహజీవనం చేయడంతో శుశ్రుత గర్భం దాల్చింది. పెళ్లికి రమేశ్‌ కుటుంబం నిరాకరించడంతో అతడి ఇంటి ముందు శుశ్రుత మూడు రోజులపాటు ఆందోళన నిర్వహించింది. పెళ్లిని అడ్డుకునేందుకు రమేశ్‌ను అతడి కుటుంబసభ్యులే గృహనిర్బంధంలో ఉంచారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అయితే ప్రజాసంఘాల సహకారంతో శుశ్రుత ఆందోళన ఉద్ధృతం చేయడంతో రమేశ్‌ కుటుంబం దిగివచ్చింది. 2015లో పెళ్లి చేసుకుని ఇద్దరూ హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. కొంతకాలం పాటు సజావుగానే సాగినా.. రమేశ్‌ కుటుంబసభ్యుల ఒత్తిడితో అప్పుడప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో శుశ్రుత పుట్టింటికి వెళ్లిపోయింది. రెండున్నర నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది. నామకరణం సందర్భంగా కూడా మరోసారి ఘర్షణ జరిగినట్లు తెలిసింది.
ఉప్పల్‌ నుంచి కొండాపూర్‌కు తీసుకెళ్లి..
పుట్టింట్లో ఉంటున్న భార్యను మాట్లాడాలంటూ శనివారం హైదరాబాద్‌కు రమేశ్‌ రప్పించాడు.శుశ్రుతను ఆమె కుటుంబసభ్యుడొకరు ఉప్పల్‌ డిపో వద్దకు తీసుకురాగా.. అక్కడి నుంచి రమేశ్‌ ఆమెను తన ద్విచక్రవాహనంపై ఘట్‌కేసర్‌ సమీపంలోని బాహ్యవలయ రహదారి వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం భార్య, కుమారులను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అంతమొందించాడు. పాలకుర్తికి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు పోలీసులకు చెప్పిన కథనం ఇలా ఉంది.. ‘శనివారం రాత్రి నాతో గొడవ జరగడంతో శుశ్రుత నిద్రమాత్రలు మింగింది. బాబుకూ ఓ మాత్ర మింగించింది. అపస్మారక స్థితిలో ఉన్న వారిని రాత్రి 9 గంటలకు బైక్‌పై కొండాపూర్‌లోని ప్రభాకర్‌ ఎన్‌క్లేవ్‌ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాను. అక్కడ శుశ్రుత, బాబుల గొంతు నులిమి చంపేశాను. సమీపంలోని బంక్‌లో పెట్రోల్‌ తీసుకొచ్చి మృతదేహాలను కాల్చేశాను..’ అని రమేశ్‌ వెల్లడించాడు. ఇదే సమాచారాన్ని పాలకుర్తి పోలీసులు ఆదివారం ఉదయం రాచకొండ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘట్‌కేసర్‌ సీఐ రఘువీర్‌రెడ్డి ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించడంతో కేవలం బూడిద, కాలిన ఎముకలు మాత్రమే కనిపించాయి. కొండాపూర్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మందల వెంకటేశం ఫిర్యాదు మేరకు 302, 201 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యను, కుమారుడిని చంపిన తరువాత, నిందితుడు మద్యం సేవించినట్లు పోలీసులకు తెలిసింది. మరోవైపు నిందితుడిని పాలకుర్తి పోలీసులు ఆదివారం సాయంత్రం ఘట్‌కేసర్‌ పోలీసులకు అప్పగించారు.

పరువుహత్య కోణంపై ఆరా
రమేశ్‌ చెప్పిన కథనంలో వాస్తవమెంత? అనేదానిపై ఘట్‌కేసర్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రదేశంలో పొలం యజమాని చెట్లను కొట్టివేసి వాటి మొదళ్లను కుప్పగా వేసి ఉంచాడు. ఆ మొద్దుల కుప్పమీదే రమేశ్‌ మృతదేహాలను తగులబెట్టాడు. పెట్రోల్‌ ముందే కొన్నాడా? హత్యలు చేసిన తరువాత కొనుగోలు చేశాడా? అనే విషయం తేల్చేందుకు పలువురిని విచారిస్తున్నారు. పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను కెమెరాల్ని పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. చంపిన తర్వాతే కాల్చేశాడా? సజీవ దహనం చేశాడా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? ఇంకెవరైనా సహకరించారా? అనేదీ తేలాల్సి ఉంది. పరువు కోసం హత్య చేసి ఉంటాడా? అని కూడా అనుమానిస్తున్నారు. తాజాగా శుశ్రుత కుటుంబసభ్యులూ పరువు హత్యేనని ఆరోపిస్తుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos