బీజేపీ పరువు పోగొట్టుకుంటుందా!

బీజేపీ పరువు పోగొట్టుకుంటుందా!

కేంద్రంలో అధికారం మరో నెలన్నర పాటు ఖాయంగా బీజేపీ చేతిలోనే ఉంటుంది. లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చి కేంద్ర కేబినెట్ అధికారాలకు కత్తెర పడేలోపే.. ఏం చేయాలన్నా బీజేపీవాళ్లు చేయగలరు. అందులో భాగంగా కర్ణాటక రాజకీయ తుట్టెనూ కదిలించేశారు. ఈ దెబ్బలో బీజేపీవాళ్లు కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణాన్ని పడగొడతారా? లేక మరోసారి భంగపడి దెబ్బతింటారా? అనేది ఆసక్తిదాయకంగా మారిందిప్పుడు. ఒకవైపు కాంగ్రెస్- జేడీఎస్ ల ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే  వీరు తమ నూటా నాలుగుమంది ఎమ్మెల్యేలను గుర్గావ్ తరలించి.. రిసార్ట్ రాజకీయం నడుపుతుండటంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అధికార కూటమిలోని ఎమ్మెల్యేలను లాగడానికి ముందు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీజేపీ వాళ్లను సుదూరం తరలించేసింది. ఇక ఇప్పటివరకూ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మాత్రమే సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చారు. కొంతమంది అధికార కూటమి ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ… అధికారికంగా ఎవ్వరూ ముందుకు రావడంలేదు. ఒకరిద్దరు మిస్సింగ్ ఎమ్మెల్యేలు కూడా మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. వారిని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార మీడియా ముందుకు తీసుకువచ్చాడు. దీంతో బీజేపీ ప్రయత్నాలు ఎటు సాగుతున్నాయి.. అనేది గందరగోళంలో పడింది. ముందుగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకే దక్కింది. బలనిరూపణలో ఫెయిలయినప్పుడే బీజేపీవాళ్లు ఆశలు వదిలేసుకున్నట్టుగా కనిపించారు. అయితే ఇప్పుడు.. మళ్లీ రచ్చ రేపారు. ఈసారి కూడా బీజేపీ ప్రయత్నాలు ఫెయిలయితే.. ఆ పార్టీ అనవసరంగా కంపు చేసుకున్నట్టే!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos