బీకాంలో ఫిజిక్స్!… సెల్ఫ్గానే దెబ్బేసుకున్నారుగా!

బీకాంలో ఫిజిక్స్!… సెల్ఫ్గానే దెబ్బేసుకున్నారుగా!

బీకాంలో ఫిజిక్స్ ఉంటుందుంటుంది అంటూ బల్ల గుద్ది మరీ చెప్పేసి అడ్డంగా బుక్కైపోయిన బెజవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్… ఇప్పుడు మరో సెల్ప్ గోల్ వేసుకుని నానా ఇబ్బంది పడుతున్నారు. నాడు బీకాంలో ఫిజిక్స్ కామెంట్ కు నెటిజన్ల ట్రోలింగ్ తోనే ఇబ్బంది పడ్డ జలీల్ ఖాన్… ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్నారు. వైసీపీలో ఉన్నా టీడీపీలో ఉన్నా చివరకు కాంగ్రెస్ లో ఉన్నా… తన మాట చెల్లుబాటు కాకుండా పోతుందా? అన్న జలీల్ ఖాన్ దీమా ఇప్పుడు ఆయనను తెర వెనుకకు నెట్టేసే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. జలీల్ వేసుకున్న స్వీయ ప్రకటనలు ఇప్పుడు బెజవాడ టీడీపీలో రచ్చరచ్చకు తెర తీశాయని చెప్పక తప్పదు. అసలు విషయంలోకి వెళితే… గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్… ఆ తర్వాత టీడీపీ విసిరిన ఆపరేషన్ ఆకర్ష్కు పడిపోయారు. ఉన్నపళంగా వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలోకి జంపైపోయారు. మంత్రిగా అవకాశం లభిస్తుందన్న ఆశతోనే జలీల్ టీడీపీలోకి చేరినా… అనంతపురం జిల్లా చాంద్ బాషా కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆ ఆశ అడియాశగానే మారిపోయింది. అయితే చివరకు ఏదో నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టుకున్న జలీల్… తన భవిష్యత్తు కంటే కూడా తన కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై ప్రణాళికలు రచించుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని సైలెంటుగానే ఫీలర్లు వదిలిన జలీల్… మొన్న తన కూతురును సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి లాంఛనంగా ఆమెను టీడీపీలోచేర్పించేశారు. ఆ తర్వాత చంద్రబాబు వద్ద నుంచి బయటకు రాగానే… వచ్చే ఎన్నికల్లో బెజవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు తన కుటుంబానికే కేటాయించేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని తన కుమార్తెను అక్కడ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారని మీడియాకు చెప్పేశారు. ఈ విషయాన్ని ఏమాత్రం నిర్ధారించుకోకుండానే మిగిలిన మీడియాతో పాటు టీడీపీ అనుకూల మీడియా కూడా తాటికాయలంత అక్షరాలతో వార్తలు రాసేసింది. అంతేనా… జలీల్ కుమార్తెకు టికెట్ కేటాయించడంతో ఇక టీడీపీలో సీట్ల కేటాయింపులు కూడా షురూ అయిపోయాయని దానికి తోక వార్తను కూడా జోడించేసింది. వెరసి బెజవాడ పశ్చిమ నియోజకవర్గంపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకుని గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నాగూల్ మీరా అగ్గి ఫైరయ్యేందుకు కారణమయ్యాయి.మీడియాలో వచ్చిన వార్తలు జలీల్ చేస్తున్న సంబరాలు చూసిన నాగుల్ మీరా కాసేపటి క్రితం ఏకంగా సీఎం వద్దకు వెళ్లారు. అయినా నియోజకవర్గంలో ఆది నుంచి పార్టీలో ఉన్న తమకు మాట మాత్రంగానైనా చెప్పకుండా జలీల్ కుమార్తెను అభ్యర్థిగా ఎలా ప్రకటించారని కూడా ఆయన చంద్రబాబును నిలదీసినంత పనిచేశారట. దీంతో అసలు విషయం బయటపడిపోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జలీల్ కూతురు పార్టీలో మాత్రమే చేరిందని తానెప్పుడు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశానని చంద్రబాబు ఎదురు ప్రశ్నించడంతో నాగూల్ మీరా వాయిస్ మరింత గట్టిగా లేచింది. పార్టీ అధినేతనే తప్పుదోవ పట్టించేలా స్వీయ ప్రకటనలు చేస్తారా?  మీ ఆటలిక సాగవంటూ జలీల్ కు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా ఓ సింగిల్ ప్రకటన ఇప్పుడు జలీల్ ను తీవ్ర ఇబ్బందుల్లో పడేసిందన్న మాట. మరి ఈ ఇబ్బంది నుంచి జలీల్ ఎలా బయటపడతారో చూడాలి. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos