బిల్లును మేం తప్పుపట్టట్లేదు కానీ.. కాంగ్రెస్‌‌

దిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్ల బిల్లుపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ బిల్లును తాము తప్పు పట్టడం లేదని, కానీ హఠాత్తుగా ఎందుకు తెచ్చారన్నదే తమకు అర్థంకాని విషయమని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్షనేత ఆనంద్‌ శర్మ అన్నారు. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భాజపాకు గుణపాఠం నేర్పాయని, కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో బిల్లును ఎందుకు హడావిడిగా తీసుకొచ్చారని ప్రశ్నించారు. సాంఘిక, రాజకీయ సమాన అవకాశాలు కల్పించాలని ఆనాడు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారని, స్వతంత్ర భారతంలో ప్రజలందరికీ భద్రత ఉండాలన్నారని ఈ సందర్భంగా ఆనంద్‌శర్మ గుర్తు చేసుకున్నారు. అచ్చేదిన్‌ అచ్చేదిన్‌ అన్నారు.. ఆ అచ్చేదిన్‌ ఎప్పుడొస్తుందో దేశమంతా ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు.

వారి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా?

రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్లను వర్తింపజేస్తామంటున్నారు. మరి రూ.8లక్షలు దాటిన ఆదాయ వర్గాల వారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు. మోదీ హయాంలో దేశంలో మిలియన్ల ఉద్యోగాలకు కోతపడిందని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు ఏటికేడు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో భారీగా కోతపడిందన్నారు. ఈ అంశంపై విస్తృతంగాచర్చ జరగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాజ్యాంగపరంగా ఇబ్బందులు వస్తాయని చెప్పారు.

ఉపాధి కల్పన లేకుండా రిజర్వేషన్లతో ప్రయోజనమేంటి?

ప్రస్తుతం రిజర్వేషన్ల అమలు ఎలా ఉంది.. ఆ ఫలాలు ఎలా అందుతున్నాయనే అంశంపై చర్చించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో లేదు.. ఉద్యోగాల కల్పన లేదని విమర్శించారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన లేకుండా రిజర్వేషన్లతో ప్రయోజనమేంటని ఆనంద్‌శర్మ ప్రశ్నించారు. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరగాలన్నారు. ఒకరోజు ఆ సభలో.. ఒకరోజు ఈ సభలో బిల్లు ఆమోదంతో ప్రయోజనం లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos