ప్రియాంక పోటీ చేసిది అక్కడి నుంచే…

ప్రియాంక పోటీ చేసిది అక్కడి నుంచే…

న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి మార్గం సుగమం చేస్తూ ఆమెను తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారంనాడు నియమించడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నానమ్మ ఇందిరాగాంధీ పోలికలు పుష్కలంగా ఉన్న ప్రియాంక రాజకీయాల్లోకి రావాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎప్పడ్నించో పట్టుపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండటం, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యూపీ కీలకం కావడంతో కాంగ్రెస్ తాజా ప్రకటనతో ఆ పార్టీలో సంబరాలు మిన్నంటుతుండగా, కాంగ్రెసేతర పార్టీలు ఈక్వేషన్లు మొదలుపెట్టేశాయి. ఇదే తరుణంలో ప్రియాంక ఎక్కడ్నించి పోటీ చేస్తారనే అంశంపైనా ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో గాంధీ కుటుంబానికి కంచుకోటగా నిలుస్తున్న రాయబరేలి నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ లోక్‌సభ స్థానానికి ప్రియాంక తల్లి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా సోనియాగాంధీ గతంలో మాదిరిగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కూడా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలి నుంచే ప్రియాంకను ఎన్నికల బరిలోకి దింపితో ఆమె గెలుపు నల్లేరుమీద నడకే అవుతుందని పార్టీ సీనియర్ నేతలు అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తోంది

. వెటకారంగా స్పందించిన జీవీఎల్!

ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీని నియమించడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రియాంకకు యూపీ బాధ్యతలు అప్పగించడం తెగ ఉత్సాహపడిపోయే విషయమేమీ కాదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు.కానీ కొందరు భజనపరులకు మాత్రం ఇది చాలా పెద్ద, భూమి కంపించిపోయే విషయంగా మారిందని ఎద్దేవా చేశారు. గతంలోనూ ప్రియాంకా గాంధీని ఎన్నికల ప్రచారానికి దించారని జీవీఎల్ గుర్తుచేశారు. ఆమె ప్రచారానికి దిగిన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ అయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos