పాల్‌.. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌!

పాల్‌.. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌!

కిలారి ఆనంద్‌ పాల్‌ క్రైస్తవ మత ప్రబోధకుడు మాత్రమేకాదు, ఇప్పుడు ఆయన ఓ రాజకీయ పార్టీకి అధినేత. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన అంటున్నారు. పవన్‌కళ్యాణ్‌, ప్రజాశాంతి పార్టీతో కలిస్తే, కొన్ని సీట్లు జనసేనకి ఇచ్చేందుకూ సిద్ధమంటున్నాడాయన. తెలుగుదేశం పార్టీనీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనీ ఓడించాలన్నదే ప్రజాశాంతి పార్టీ పట్టుదల అని చెబుతున్నాడు కె.ఎ.పాల్‌.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో వుందనీ, తాను అధికారంలోకి వస్తే తనకు పరిచయం వున్న ప్రపంచస్థాయి కుబేరులతో మాట్లాడి, 7 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొస్తానని కె.ఎ.పాల్‌ ప్రకటించడం గమనార్హం. అదసలు సాధ్యమయ్యే పనేనా.? అని ప్రశ్నిస్తే, ‘ఏడుకోట్ల కోట్లు డబ్బు నా స్నేహితుల దగ్గర వుంది. దాంట్లో ఒకశాతం తీసుకొచ్చినా చాలు..’ అంటూ కె.ఎ.పాల్‌ లెక్కలు చెప్పి అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాడు.ఒకప్పుడు కె.ఎ.పాల్‌ అంటే బోయింగ్‌ 747 విమానంలో ప్రపంచమంతా చుట్టేసిన క్రైస్తవ మత ప్రచారకుడు గుర్తుకొస్తాడు. కానీ, ఇప్పుడు పరిస్థితులు అవికావు. ఆ విమానం ఇప్పుడెక్కడుందో ఆయనకీ తెలియదు. ప్రపంచంలో పలు దేశాల్లో తిరిగి క్రైస్తవమత వ్యాప్తిలో పాల్‌ తనవంతు కృషిచేసిన మాట వాస్తవం. ఉత్తరాంధ్రలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కిలారి ఆనంద్‌ పాల్‌, ప్రపంచస్థాయి గుర్తింపు పొందడమంటే చిన్న విషయం కాదు.మొత్తమ్మీద, ఇప్పుడు కె.ఎ.పాల్‌లో బోల్డంత ఫ్రస్ట్రేషన్‌ కన్పిస్తోంది. అందులోంచే ఫన్‌ జనరేట్‌ అవుతోంది. విజయవాడలో పదికి మూడు ఓట్లు తమవేనని చెబుతున్నాడాయన. మిగతాచోట్ల పదికి నాలుగు ఓట్లు ప్రజాశాంతి పార్టీవేనట. ఇంత క్లియర్‌గా కె.ఎ.పాల్‌ చెప్పేస్తేంటే ఎన్నికలు ఎందుకట.? వందలాది మంది అభ్యర్థులట.. వేలాదిమందితో ఎన్నికల వ్యూహం రచించడమట.. కె.ఎ.పాల్‌ చెబుతున్న పొలిటికల్‌ కథలు అన్నీఇన్నీ కావు.గతంలోనూ ఎన్నికల సందర్భంగా కె.ఎ.పాల్‌ ఈ తరహాలోనే హడావిడి చేశాడు, ఆ తర్వాత తెరమరుగైపోయాడు. మరిప్పుడు, ఈసారి ఏమవుతుంది.? ఈ హంగామా ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది.? వేచి చూడాల్సిందే.

తాజా సమాచారం