పాటల పూదోటలో విహారి వేటూరి

  • In Film
  • January 29, 2019
  • 194 Views
పాటల పూదోటలో విహారి వేటూరి

వేటూరి సుందరరామ్మూర్తి..  పాట బతికున్నంత కాలం మరిచిపోలేని పేరు ఇది. తెలుగు భాష వినిపించినంత మేరా పలికే శబ్దం వేటూరి. తెలుగు సినిమా పాటపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. మూడున్నర దశాబ్దాల పాటు సాగిన వేటూరి సినీ కవితా సేద్యంలో ఉద్భవించిన వేలాది పాటల సంపద మనకే వదిలేసి వెళ్లారు. అలా పాటను ఒంటరిని చేసి అప్పుడే తొమ్మిదేళ్లయ్యింది.. కృష్ణాజిల్లా పెదకళ్ళేపల్లి గ్రామంలో పండితుడు వేటూరి ప్రభాకరశాస్త్రుల తమ్ముడి కొడుకుగా 1936 జనవరి 29వ తేదీన జన్మించిన వేటూరి సుందరరామమూర్తి తెలుగు సినీ పాటలతోటలోకి విచిత్రంగా ప్రవేశించాడు.  తోటమాలిగా మారతాడని… అందమైన అద్భుతమైన పాటల సేద్యం చేస్తాడని ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. ప్రభాకరశాస్త్రిగారితోనూ ఆయన సన్నిహితులతోనూ తాను గడిపిన క్షణాలే తనలో కనిపించే పాండిత్యమని చెప్పుకున్న నిగర్వి వేటూరి సుందరరామమూర్తి.

వేటూరి తొలి సినీ రచన  `ఓ సీత కథ`తోనే మొదలైంది. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ దగ్గర సాహిత్య శిష్యరికం చేసిన వేటూరికి కవితా ప్రక్రియలో అసాధ్యమనేదే లేదు. ముందు ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభలలో జర్నలిస్ట్గా పనిచేసిన వేటూరికి కళాతపస్వి డాక్టర్ కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ”ఓ సీత కథ” చిత్రంలో హరికథ రాసే అవకాశం వచ్చింది. అయితే సినీ గేయ రచయితగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నది మాత్రం `అడవి రాముడు`తోనే. ఆ తర్వాత ఆయన పనయం వందలాది పాటలతో అజేయంగా సాగిన సంగతి సినీప్రియులకు తెలిసిందే.మాస్ .. మనసు దోచేసుకున్న పాట .. ఆరేసుకోబోయి పారేసుకున్నా ను.. ఆ రోజుల్లో కోటిరూపాయల పాటగా పిల్చేవారు. ఆ తర్వాత మాస్ సాంగ్స్ అంటే… వేటూరి రాయాలి. చక్రవర్తి ట్యూన్ చేయాలి … సలీం స్టెప్పులేయించాలి…ఇదీ వరస… ఓ పదిహేనేళ్లపాటు ఈ ముగ్గురూ దుమ్ముదులిపేశారు. `ఆకుచాటు పిందె తడిసె` బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది…` లాంటి అనేక సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఈ కాంబినేషన్లో వచ్చాయి. పండిత పామరులను అలరింప చేసే అరుదైన గ్రాంధిక వ్యావహారిక భాషలో పట్టున్న వేటూరి జంధ్యాల లు  సినీ జీవితం లో సమకాలీనులవడం  తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం. వారివురు తెలుగు వారి అభిరుచులను గ్రహించి  వ్యాపార అవసరాలకు అనుగుణంగా పని చేసిన తీరు అపూర్వం. వారు సిరి సిరి మువ్వ లతో ఆడుకున్నారు శంకరాభరణం కు అలంకారాలు చేసారు. అడవి రాముడు లో వేడుకలు చేసుకున్నారు సప్తపది కి అడుగులో అడుగు వేసారు వేటగాడు తో వినోదం పంచారు. ఇంకా చాలా సినిమాలకు కలిసి పనిచేశారు. జంధ్యాల దర్శకుడిగా మారిన తరువాత వేటూరికి వ్యాపార దృక్పధం లో కాక కొత్త కోణం లో తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలిపించారు. స్వతహాగా జంధ్యాల మంచి అభిరుచి కలిగిన రచయిత అవడం వల్ల వేటూరి కి కొన్ని మంచి సన్నివేశాలకి పాటలు వ్రాసే అవకాశం కలిగింది. వేటూరి ప్రేమను అందాన్ని సుకుమారం గా వర్ణిస్తూ పాటలు రాశారు. అన్ని కోణాల్లో తరచి తరచి అన్నిరకాల రసాల్ని పాట ద్వారా విహరింపజేసిన గొప్ప రచయిత వేటూరి. నేడు ఆయన జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos