నెలనెలా ఖాతాలో డబ్బు

  • In Money
  • January 21, 2019
  • 715 Views
నెలనెలా ఖాతాలో డబ్బు

  • సిక్కింలో సార్వత్రిక కనీస ఆదాయ పథకం… తరతమ భేదాలు లేకుండా పౌరులందరికీ లబ్ధి
  • ప్రకటించిన ఎస్‌డీఎఫ్‌ సర్కారు.. 2022కల్లా పథకం అమలు

ఏ రాష్ట్రంలో చూసినా వృద్ధాప్య పింఛన్లు, నిరుద్యోగ భృతి, దివ్యాంగుల, వితంతు పింఛన్లు అంటూ ప్రజలకు ఏదో రకంగా ప్రభుత్వాలు డబ్బులిస్తూనే ఉన్నాయి. అయినా రాష్ట్రంలోని కొంతమందికే ఇలాంటివి చేరుతున్నాయి. ఏదో రకంగా డబ్బులందుతున్నవారు సంతోషంగానే ఉన్నా.. అందని వారి పరిస్థితేంటి? సర్కారు మాపై కూడా కాస్త దయచూపితే బాగుండని ఒక్కసారైనా మనసులో అనుకుంటారు. ఇప్పుడు అలాంటి వారి గురించి కూడా ఆలోచిస్తోంది ఓ రాష్ట్రం! కులం- మతం, ఆడామగ, చిన్నా-పెద్దా అనే తారతమ్యాలు లేకుండా ప్రతిఒక్కరి ఖాతాలో ప్రతినెలా కొంత మొత్తాన్ని జమచేయాలని సంకల్పించింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇలాంటివి మనదేశంలో సాధ్యం కాదనిపిస్తోంది కదూ! కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. పేదరికం, అసమానతలను రూపుమాపాలని చూస్తోంది. ఆ రాష్ట్రమే సిక్కిం! ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కం – యూబీఐ) అందిస్తామని సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) సర్కారు ప్రకటించింది. ఈ పథకం ప్రకారం రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ప్రతినెలా కొంత మొత్తాన్ని అందించనుంది. ఆ మొత్తం ఎంత అనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. భారత ఆర్థిక సర్వే-2017లో ఈ పథకం గురించి ప్రస్తావించగా.. సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ చామ్లింగ్‌ అప్పటి నుంచే దీనిపై దృష్టి సారించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఆర్థిక వేత్తలతో చర్చలు జరుపుతున్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఆర్థిక రంగంలో కాకలు తీరి.. అగ్రరాజ్యాలుగా పేరున్న దేశాలే ఇలాంటి పథకాన్ని అమలు చేయడంలో చతికిలపడిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం దృష్టిని సిక్కిం ఆకర్షిస్తోంది. ప్రస్తుతానికి ఏదో ఒక ప్రాంతాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి.. 2022కల్లా పూర్తిస్థాయిలో పథకం అమలుకు ముందడుగు వేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఈ పథకం అమల్లోకి రాగానే.. పౌరుల బ్యాంకు ఖాతాల్లో ప్రతినెలా ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం జమ కానుంది. రాష్ట్ర జనాభా 6,10,577 కాగా.. ప్రతి పౌరుడిని ఈ పథకం కిందకు తీసుకువచ్చి, లబ్ధి చేకూర్చనున్నారు. నిరుద్యోగులు, గృహిణులు, రైతు కూలీలు, కార్మిక, కర్షక వర్గాలకు ఇది ఓ వరం లాంటిదే. అమలు సాధ్యమేనా?సిక్కింలో అద్భుతమైన వనరులు ఉన్నా.. అభివృద్ధిలో సమర్థ నాయకత్వం లేకపోవడమే ప్రధాన లోపంగా ఆర్థికవేత్తలు చెబుతుంటారు. పౌరులందరికీ యూబీఐ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని సిక్కిం ప్రభుత్వం భావిస్తోంది. ఏమిటీ పథకంఒక దేశంలో గానీ.. ఒక రాష్ట్రంలో గానీ.. లేదా మారుమూల ప్రాంతాల్లో నివసించే పౌరులందరికీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతినెలా అందించే ఆర్థిక సాయాన్ని సార్వత్రిక కనీస ఆదాయ పథకం (యూబీఐ) అంటారు. పేదరికం, అసమానతలను రూపుమాపడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సిక్కిం విజయాలివీ..

  • 1998 నుంచి ప్లాస్టిక్‌ బ్యాగుల నిషేధాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది.
  • 98 శాతం అక్షరాస్యతను సాధించింది. దేశంలో పేదరికం 30ు ఉండగా.. సిక్కింలో అది 8 శాతంగా ఉంది.
  • దేశంలోనే.. రసాయన ఎరువులపై నిషేధాన్ని అమలు చేస్తూ ఆర్గానిక్‌ పంటలు పండిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది.
  • ప్రతి పౌరుడిని గృహనిర్మాణ పథకం పరిధిలోకి తెచ్చి అందరికీ ఇళ్లను కట్టి ఇచ్చింది.
  •  ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత పథకాలను సమర్థంగా అమలు చేస్తోంది.
  • విద్యుత్తు ప్రాజెక్టులు, పర్యాటకం సిక్కిం ప్రధాన ఆదాయ వనరులు. మిగులు విద్యుత్తులో అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తులో 90 శాతాన్ని ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తోంది. ఏటా 25 లక్షల మంది పర్యాటకులు ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు.

విదేశాల్లో వైఫల్యాలే..!సార్వత్రిక కనీస ఆదాయం పథకాన్ని పలు దేశాలు అమలు చేసినా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. కానీ, సిక్కిం విషయంలో తక్కువ జనాభా ఉండటం.. పథకాల అమల్లో సక్సెస్‌ రేటు కారణంగా ఆ పథకం పక్కాగా అమలవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • 2017 ఏప్రిల్‌లో కెనడాలోని ఒంటారియో రాష్ట్రం ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసింది. 4 వేల మంది పౌరులకు నెలకు 150 మిలియన్‌ డాలర్లను వెచ్చించింది. ఏడాది తిరక్కుండానే అమలులో సర్కారు చేతులెత్తేసింది.
  • రెండేళ్ల క్రితం ఫిన్‌లాండ్‌ లో ఈ పథకాన్ని అమలు చేశారు. 2 వేల మంది నిరుద్యోగులకు నెలకు 630 డాలర్ల చొప్పున అందజేశారు. గత ఏడాది దాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు.
  • అమెరికాలోని స్టాక్టన్‌, కాలిఫోర్నియాల్లో 100 కుటుంబాలకు నెలకు 500 డాలర్ల చొప్పున ఇచ్చారు. ఆ పథకం 18 నెలలకే పరిమితమైంది.
  • సిలికాన్‌ వ్యాలీలో యువతను ప్రోత్సహించేందుకు ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకెర్‌బర్గ్‌, స్పేస్‌-ఎక్స్‌ అధినేత ఎలొన్‌ మస్క్‌లు ప్రోత్సాహకాలను ప్రకటించి.. కొంతకాలమే అమలు చేయగలిగారు.
  • ఈ తరహా పథకాలు స్టాక్టన్‌ వంటి నగరాల్లో ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు కానీ.. సిక్కిం లాంటి రాష్ట్రాల్లో సుసాధ్యమేనని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ప్రొఫెసర్‌, ఆర్థికవేత్త ప్రణబ్‌ బర్దన్‌ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos