నాయకుడు ఇలా ఉన్నాడు.

  • In Film
  • January 9, 2019
  • 838 Views

తెలుగు వారి ఆరాధ్య న‌టుడు నందమూరి తార‌క‌రామారావు.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన క‌థానాయ‌కుడు. అలాగే రాజకీయాల్లో తెలుగువారి ప్ర‌భంజ‌నాన్ని ఢిల్లీ కోట‌కు చేర‌వేసిన మ‌హానాయ‌కుడు `య‌న్‌.టి.ఆర్‌`. సినీ జీవితంలో త‌న న‌ట‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ ద్వారా న‌టుడిగా, నిర్మాత‌గా, మార్గ‌ద‌ర్శ‌కుడిగా రాణించి ఎంద‌రికో ఆద‌ర్శప్రాయుడిగా నిలిచారు. ఇటు సినీ రంగం.. అటు రాజ‌కీయ రంగంలో శాశ్వ‌త‌మైన ముద్ర‌ను వేశారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డం అంటే సాహ‌స‌మే అనాలి. అలాంటి సాహసానికి పూనుకుని ఓ మ‌హానీయుడి చ‌రిత్ర‌ను భావిత‌రాల‌కు అందించాల‌నే త‌ప‌న‌తో ఆయ‌న త‌న‌యుడు నందమూరి బాల‌కృష్ణ… ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించారు. అది కూడా రెండు భాగాలుగా ఆయ‌న సినీ ప‌థంలో అంచెలంచెలుగా అధిరోహించి అగ్ర క‌థానాయ‌కుడుగా ఎదిగిన వైనాన్ని `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` అని.. రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఆయ‌న సాధించిన విజ‌యాల ఆధారంగా య‌న్.టి.ఆర్‌.మ‌హానాయ‌కుడు`గా తెర‌కెక్కించారు.
ఎన్టీఆర్ ప్ర‌యాణం..సాధించిన మైలురాళ్లు ఎంద‌రికో స్ఫూర్తిదాయకం. దాంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి అంద‌రిలో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే న‌టించ‌నంత మంది భారీ తారాగ‌ణంతో రూపొందిన ఈ సినిమాకు జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌కుడు. బాల‌కృష్ణ 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌కర్ణిని డైరెక్ట్ చేసిన ఈ ద‌ర్శ‌కుడే ఈ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించాడు. అస‌లు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో సామాన్య జ‌నాల‌కు తెలియ‌ని విష‌యాల‌ను ఏం చూప‌బోతున్నారు? అస‌లు ఆయ‌న‌కు సినిమాల్లో రావాల‌నే కోరిక ఎందుకుపుట్టింది? ఆయ‌న ప్ర‌యాణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ఏంటి? ఇలాంటి విష‌యాల‌ను తెలుసుకోవాల‌నే ఆస‌క్తి అంద‌రిలో పెరిగింది. అస‌లు య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌లో తొలి భాగం క‌థానాయ‌కుడు గురించి చూద్దాం…

క‌థ‌:
1984 బ్యాక్‌డ్రాప్‌లో చెన్నై అడ‌యార్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో బ‌స‌వ తార‌క‌మ్మ‌(విద్యాబాల‌న్) చికిత్స తీసుకుంటూ ఉంటుంది. ఆమెను క‌ల‌వ‌డానికి అక్క‌డికి ఆమె కొడుకు హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్ రామ్‌) వ‌స్తాడు. ఆమె య‌న్‌.టి.ఆర్ ఆల్బ‌మ్ చూడ‌టంతో సినిమా స్టార్ట్ అవుతుంది. నంద‌మూరి తార‌క రామారావు(బాల‌కృష్ణ‌) రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ లంచాలు తీసుకుని ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డాన్ని స‌హించ‌లేక మానేసి సినిమాల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. మ‌ద్రాస్ చేరుకుని ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారిని క‌లుస్తాడు. అక్క‌డి నుంచి ఆయ‌న జీవితంలో సినిమా ఓ భాగంగా ఎలా మారింది. న‌టుడి నుంచి అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదిగే క్ర‌మంలో ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్లు ఏంటి? ఆయ‌న‌కు చేసిన పాత్ర‌లు, ఆయ‌న ప్ర‌యాణం.. ఇత‌రుల‌తో ఆయ‌న మెలిగే తీరు.. సినిమాల‌పై ఆయ‌న‌కున్న క‌మిట్‌మెంట్.. సాధార‌ణంగా ఎన్టీఆర్ సినిమాల గురించి తెలుసు.. రాజ‌కీయంగా కూడా ఆయ‌నేంటో తెలుసు. మ‌రి ఆయ‌న‌కు తెలియ‌ని దాన్ని ఈ సినిమాలో ఏమైనా చూపించారా? అంటే అవ‌న్నీ సినిమాలో చూడాల్సిందే..
ప్ల‌స్ పాయింట్స్‌:
– న‌టీన‌టులు
– ద‌ర్శ‌క‌త్వం
– కెమెరా ప‌నిత‌నం
– సంగీతం, నేప‌థ్య సంగీతం
– ఎడిటింగ్‌
– ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు

మైన‌స్ పాయింట్స్‌:
యంగ్ ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ కొన్ని స‌న్నివేశాల్లో సెట్ అయిన‌ట్లు అనిపించ‌లేదు. నిడివి ఎక్కువ‌గా ఉండ‌టం

విశ్లేష‌ణ‌
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు – మ‌హానాయకుడు అని రెండు భాగాలుగా విడుద‌ల‌వుతుంద‌ని తెలియ‌గానే అంద‌రూ మొద‌టిది సినిమాల గురించి, రెండోది రాజ‌కీయాల గురించి అని అనుకున్నారు. అందులో వాస్త‌వం ఉంది. ఆయ‌న జీవితంలో జ‌రిగిన మ‌రెన్నో వాస్త‌వాల‌కూ ఆ చిత్రాల్లో చోటున్నాయి. ఆ విష‌యం `య‌న్‌.టి.ఆర్‌`. క‌థానాయ‌కుడు చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. ఓ రైతు బిడ్డ త‌న‌కు మెరిట్‌లో వ‌చ్చిన ఉద్యోగాన్ని కాద‌నుకుని మ‌ద్రాసు వెళ్లి సినిమాల్లో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చి.., స‌మాజానికి త‌న‌కు వీలైనంత సాయం చేయ‌డం, దాన్ని కూడా దాటి రాజ‌కీయాల్లోకి రావాల‌నుకోవ‌డం క్లుప్తంగా తొలి భాగంలో ఉన్న క‌థ‌. క‌థ‌గా ఇంత స‌న్న‌టి విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ, ఈ సినిమాలో అంత‌కు మించి స‌న్నివేశాలున్నాయి. భ‌ర్త ఆశ‌యానికి త‌న ఆమోద‌ముద్ర‌తో ఊపిరిలూదిన భార్య బ‌స‌వ‌తార‌కం. అన్న‌కు తోడుగా ఆసాంతం ఆయ‌న‌తోనే ఉన్న త‌మ్ముడు త్రివిక్ర‌మరావు.

యువ ర‌క్తానికి, దూడుకు త‌నానికి ప్ర‌తీక‌గా క‌నిపించిన హ‌రికృష్ణ‌, ఎన్టీఆర్ జీవితంలో ఎంతో కీల‌క పాత్ర వ‌హించిన ఎల్వీ ప్ర‌సాద్‌, కె.వి.రెడ్డి, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి, అప్ప‌ట్లో తార‌లు సెట్లో ముచ్చ‌టించుకునే విష‌యాలు, ఎన్టీఆర్‌-ఏఎన్నార్ మ‌ధ్య అనుబంధం, తిరుప‌తికి వెళ్లిన తెలుగువారు మ‌ద్రాసు వెళ్లి ఎన్టీఆర్‌ను క‌ల‌వ‌డం, ఎన్టీఆర్ వ‌య‌సు మ‌ళ్లిన త‌ర్వాత న‌టించిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను చూసిన కుటుంబ‌స‌భ్యులు మ‌రీ ముఖ్యంగా కుమార్తెలు ఎలా ప్ర‌వ‌ర్తించారు? ఎన్టీఆర్ ఇంట్లో ఎన్నిర‌కాల న‌గ‌లున్నాయి? ప‌ద్మ‌శ్రీ వ‌చ్చిన‌ప్పుడు ఎన్టీఆర్ ఇందిరాగాంధీతో అన్న మాట‌లేంటి? తెలుగు ప‌రిశ్ర‌మ చెన్నై నుంచి హైద‌రాబాద్ త‌ర‌లి రావ‌డం గురించి ఎన్టీఆర్‌, ఏఎన్నార్ ఏమ‌నుకున్నారు? దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌లో నాగేశ్వ‌ర‌రావును న‌టించ‌మ‌ని ఎన్టీఆర్ అడిగితే అందుకు అన్న‌పూర్ణ‌మ్మ‌కు ఇచ్చిన మాట‌లో ఏఎన్నార్ దేని గురించి ప్ర‌స్తావించారు? ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌న్న‌ప్పుడు బ‌స‌వ‌తార‌కం చెప్పిన మాటేంటి? అన్నిటికీ ఎదురు వ‌చ్చే బ‌స‌వ‌తార‌కం ఆ రోజు ఎదురొచ్చిందా? రాలేదా? వంటివ‌న్నీ ఇందులో ఉన్నాయి. అంతేకాదు.. రాయ‌ల‌సీమ క్షామం, దివిసీమ ఉప్పెన‌, ప్ర‌జ‌ల క‌ష్ట‌న‌ష్టాలు, ఎమ‌ర్జ‌ెన్సీ స‌మ‌యంలో పీతాంబ‌రం తీసిన `అన్న‌ద‌మ్ముల అనుబంధం` చిత్రం విడుద‌ల‌లో జ‌రిగిన అంశాలేంటి? వ‌ంటివన్నిటినీ చూపించారు.

సినిమాల ప‌రంగా చూపిస్తున్నాం క‌దా అని కుటుంబాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. అన్నిటినీ బ్యాల‌న్స్ చేస్తూ సినిమాను తీసిన ఘ‌న‌త మాత్రం క్రిష్‌కే ద‌క్కుతుంది. `మ‌న‌దేశం` నుంచి `వేట‌గాడు` వ‌ర‌కు ఆయ‌న చేసిన ఎన్నో సినిమాల్లోని స‌న్నివేశాల‌ను ఇందులో తీశారు. అందుకు త‌గ్గ కాస్ట్యూమ్స్, ఆ పాత్ర‌ల త‌ర‌హా మేక‌ప్‌, ఆ అట్మాస్పియ‌ర్‌ను క్రియేట్ చేయ‌డం కూడా స‌వాలైన ప‌నే. అన్నిటినీ స‌వ్యంగా చేశారు. సంద‌ర్భోచితంగా పాట‌లు, ప్ర‌తి స‌న్నివేశంలోనూ మెప్పించే డైలాగులు కూడా ఆక‌ట్టుకున్నాయి. న‌టీన‌టులు ఒక్క స‌న్నివేశంలో క‌నిపించిన‌ప్ప‌టికీ, ఆ పాత్ర‌ల తాలూకు ఇంపాక్ట్ ప్రేక్ష‌కుల మీద క‌నిపిస్తుంది. మేక‌ప్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను కూడా ప్ర‌త్యేకంగా అభినందించాలి. కీర‌వాణి సంగీతం, నేప‌థ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. కొన్ని స‌న్నివేశాల్లో విద్యాబాల‌న్‌ని చూస్తుంటే అచ్చు బ‌స‌వ‌తార‌కం ఇలాగే ఉండేవారేమోన‌నిపించింది. `బావా` అని విద్యాబాల‌న్ పిలిచే పిలుపులో, దివిసీమ ఉప్పెన స‌మ‌యంలో త‌న‌వారి కోసం ఆమె ప‌డే ఆందోళ‌న‌లో, ఎక్క‌డో మ‌ద్రాసులో ఉండిపోయామ‌ని ఆమె ప‌లికే ప‌లుకుల్లో అచ్చ‌తెలుగుద‌నం క‌నిపించింది. పెళ్ల‌యి పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిన తెలుగ‌మ్మాయిల మ‌న‌సు ప్ర‌తిబింబించింది.

చంద్రబాబునాయుడు పాత్ర‌లో రానా ప‌ర్ఫెక్ట్. భ‌వ‌నం పాత్ర‌లో నాజ‌ర్‌, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుగా డా.భ‌ర‌త్‌, ఎన్టీఆర్ బావ‌మ‌రిదిగా వెన్నెల కిశోర్‌.. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల్లో మెప్పించారు.. ఎన్టీఆర్‌ను ఎవ‌రు ఏ త‌ర‌హాలో చూడాల‌నుకుంటే, ఆ త‌ర‌హాలో చూపించారు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

చివ‌ర‌గా.. య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు.. స్ఫూర్తిదాయకం
రేటింగ్‌: తెలుగు జాతి గొప్ప‌తనాన్ని, ఆత్మ‌గౌర‌వాన్ని ఎలుగెత్తి చాటిన వ్య‌క్తి జీవిత క‌థ‌ను భావి త‌రాల‌కు అందించే ప్ర‌య‌త్నంలో భాగంగా తెర‌కెక్కించిన సినిమాకు రేటింగ్ ఇవ్వ‌ద‌లుచుకోలేదు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు – రిజిస్ట్రేషన్ ఉచితం!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos