‘దేశద్రోహం’ చట్టాన్ని తొలగించాలి: కపిల్ సిబల్

‘దేశద్రోహం’ చట్టాన్ని తొలగించాలి: కపిల్ సిబల్

న్యూఢిల్లీ: ‘దేశద్రోహం’ చట్టాన్ని తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఇదొక వలసవాద చట్టమని, దీన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, వలసవాదుల చట్టం ఇవాల్టి రోజుల్లో ఎంతమాత్రం అవసరం లేదని అన్నారు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన వాళ్లపై కూడా ‘దేశద్రోహం’ కేసులు బనాయిస్తున్నారని, చట్టాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు. 2016, ఫిబ్రవరి 9న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగంపై జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై 1200 పేజీల ఛార్జిషీటును ఢిల్లీ పోలీసులు గత సోమవారం దాఖలు చేశారు. మాజీ విద్యార్థి నేతలు ఉమర్ ఖాలీద్, అనిర్బన్ భట్టాచార్యతో పాటు 35 మంది పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్నారు. దీనిపై రెండ్రోజుల తర్వాత కపిల్ సిబల్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, మూడేళ్ల క్రితం కేసుపై ఇప్పుడు ఛార్జిషీటు దాఖలు చేయడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఎన్నికల వేళ, అదికూడా తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రధాని ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని కన్హయ్య కుమార్ విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos