దిల్లీలో ఆప్‌-కాంగ్రెస్‌ దోస్తీ..

దిల్లీలో ఆప్‌-కాంగ్రెస్‌ దోస్తీ..

న్యూదిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్‌ల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం… దిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలుండగా ఆప్‌, కాంగ్రెస్‌ మూడేసి స్థానాల చొప్పున పోటీ చేయనున్నాయి. మిగిలిన ఒక్క స్థానాన్ని కేంద్ర మాజీ మంత్రి, భాజపా తిరుగుబాటు నేత యశ్వంత్‌ సిన్హాకు ఇవ్వనున్నాయి. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ‘దీనిపై మూడు నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. మూడేసి స్థానాల చొప్పున పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి’ అని దిల్లీ కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. దిల్లీ దక్షిణ, తూర్పు, ఈశాన్య నియోజక వర్గాల్లో ఆప్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ స్థానాల్లో దిలీప్‌ పాండే, ఆతిషీ మర్లెనా, రాఘవ్‌ చద్దా పోటీ చేయనున్నారు.

దిల్లీ పశ్చిమ, వాయవ్యం, చాంద్‌నీ చౌక్‌ స్థానాల నుంచి కాంగ్రెస్‌ నేతలు పోటీ చేయనున్నారు. అలాగే, రాజస్థాన్‌, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో కూడా కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌, ఆప్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా, దిల్లీలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏడు స్థానాలనూ గెలుచుకోగా, 2014 ఎన్నికల్లో భాజపా క్లీన్‌ స్వీప్‌ చేసింది. ప్రస్తుతం దిల్లీ నుంచి కాంగ్రెస్‌, ఆప్‌లకు ఒక్క లోక్‌సభ సీటు కూడా లేదు. రానున్న ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోటీ చేసే విషయంపై కొందరు కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ రాజీనామా చేయడం వెనుక ఈ కారణమే ఉందని ప్రచారం జరుగుతోంది. పొత్తుల విషయంలో అధికారికంగా ఇరు పార్టీలు ఎటువంటి ప్రకటన చేయలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos