తలసానీ! ఏపీకి నీ అవసరంలేదు:

తలసానీ! ఏపీకి నీ అవసరంలేదు:

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలకు దిమ్మతిరిగే షాకిచ్చేలా మాట్లాడారు. టీఆర్ఎస్, వైసీపీ ఒక్కటవుతున్నాయనే వాదనల నేపథ్యంలో తెరాసకు షాకిచ్చేలా మాట్లాడటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసాని అవసరం లేదని పార్థసారథి చెప్పారు. ఇక్కడి బీసీల గురించి ఆయన (తలసాని) కన్నా ఎక్కువగా ఆలోచించే నాయకులు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. నవ్యాంధ్రలో బీసీల కోసం ఆలోచించే వాళ్లు చాలామందే ఉన్నారని తెలిపారు. అలాంటిది తలసాని చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.

తలసాని తెలంగాణ రాజకీయాల్లో ఎదగాలి..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మరింతగా ఎదగాలని పార్థసారథి హితవు పలికారు. ఏపీకి ఆయన ఎప్పుడు వచ్చినా ఒక సోదరుడిలా ఆహ్వానిస్తామని చెప్పారు. కానీ ఏపీ రాజకీయాల్లోకి వస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాలకే తలసాని పరిమితమైతే మంచిదని సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమవరం వెళ్లిన తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యాదవ నేతలు రాజకీయంగా ఎదగాలని, ఇళ్లలో కూర్చుంటే రాజకీయ అవకాశాలు రావని, యాదవులు సంఖ్యా బలం చూపాలన్నారు. ఏపీలో యాదవుల రాజకీయ ఎదుగుదలకు తాను అండగా ఉంటానని చెప్పారు. ఏపీలో బీసీలకు ఆదరణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో యాదవులకే కాదని, బీసీలకు కూడా నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీనిపై పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో చాలామంది బీసీ నేతలు ఉన్నారని చెప్పారు.
పార్థసారథి ఆగ్రహం వెనుక..
తలసాని వ్యాఖ్యలపై పార్థసారథికి ఆగ్రహం వచ్చిందా లేక టీఆర్ఎస్‌తో జత కలుస్తూ ఏపీకి అన్యాయం చేస్తున్నారనే టీడీపీ నేతల ఎదురుదాడి నేపథ్యంలో పార్టీకి నష్టం జరగకుండా ఉండే క్రమంలో ఇలా మాట్లాడుతున్నారా అనే చర్చ సాగుతోంది. తనతో పొత్తు కోసం తెరాస నేతల ద్వారా వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని పవన్ చెప్పినట్లుగా వార్తలు వచ్చిన కొద్ది రోజులకే జగన్, కేటీఆర్ కలుసుకోవడం గమనార్హం. దీంతో టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీకి అన్యాయం చేయాలనుకుంటున్న వారితో కలుస్తారా అని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి నష్టం జరగకుండా ఉండే క్రమంలో వైసీపీ నేతలు పలువురు వివరణ కూడా ఇచ్చారు. ఏపీలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, తెరాసతో పొత్తు ఉండదని, కేవలం ఫెడరల్ ఫ్రంట్ పైన మాత్రమే చర్చలు జరిగాయని చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా పార్థసారథి.. ఏకంగా తలసాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సరైన బీసీ నేత లేరనే అభిప్రాయంతో తలసాని మాట్లాడిన వ్యాఖ్యలు వైసీపీ నేతకు కోపం తెప్పించి ఉంటాయని అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos