ఢాకా అగ్నిప్రమాదంలో 69మంది సజీవదహనం

ఢాకా అగ్నిప్రమాదంలో 69మంది సజీవదహనం

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో రసాయన, ప్లాస్టిక్‌ గోదాములో  సంభవించిన అగ్నిప్రమాదంలో 69 మంది సజీవదహనమయ్యారు. మరో నూరు మంది గాయపడ్డారు. చికిత్స కోసం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెండు కార్లు, పదుల సంఖ్యలో ద్విచక్రవాహనాలు దగ్ధ మయ్యాయని ఢాకా పోలీస్ కమిషనర్ ఇబ్రహీం ఖాన్ తెలిపారు. 45 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పాత ఢాకా చౌక్‌బజార్‌ ప్రాంతంలోని హజీ వాహెద్‌ మాన్షన్‌ గోదాములో బుధవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఈ దుర్ఘటన సంభవించింది. రసాయనాలను భద్రపరిచిన చోట గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న నాలుగు భవనాలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి  చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 200 మంది సిబ్బంది.మంటలను ఆర్పేందుకు కృషి చేసారు.గోదాం ఉన్న ప్రాంతంలో రహదారులు ఇరుగ్గా ఉండటంతో మంటలను అదుపుచేయడం కష్టంగా మారింది. భవనాల్లో ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అగ్నిమాపకసిబ్బంది యత్నిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.  అగ్ని కీలలు ఎగిసి పడుతుండటం సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న భవనంలో రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లో ప్లాస్టిక్‌ గోదాంతో పాటు కొన్ని నివాసాలూ ఉన్నాయి. వాటిలోని వారంతా మంటల్లో చిక్కుకుపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos