జల్లికట్టు నిర్వహణకు ప్రత్యేక కమిటీ: హైకోర్టు ఆదేశం

జల్లికట్టు నిర్వహణకు ప్రత్యేక కమిటీ: హైకోర్టు ఆదేశం

చెన్నై: మదురై జిల్లా అవనియాపురంలో జల్లికట్టు నిర్వహణకు మద్రాసు హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని కూడా కోర్టు ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమిళ సంప్రదాయ సాహస క్రీడ అయిన జల్లికట్టు పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ యేడాది కూడా మదురై జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ పోటీలను నిర్వహించేందుకు అనేక గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జల్లికట్టు నిర్వహణకు పేరొందిన అవనియాపురంలో సంక్రాంతి రోజున, కానుం పొంగల్‌ రోజున పాలమేడులో, మూడో రోజున అలంగానల్లూరులో ఈ పోటీలు అట్టహాసంగా జరుగుతాయి. అయితే, అవనియాపురంలో ఈ పోటీల నిర్వహణ విషయంపై రెండు వర్గాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి.గతంలో ఈ పోటీలను నిర్వహిస్తూ వచ్చిన గణేశన్‌ అనే వ్యక్తి ఈ దఫా ఈ తరహా పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వరాదంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ, మునియస్వామి అనే వ్యక్తి పోటీల నిర్వహణకు అనుమతి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పైగా, అవనియాపురంలో జరిగే జల్లికట్టు పోటీలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినట్టు గుర్తుచేశారు. ఈ పోటీని 15వ తేదీన నిర్వహించాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా అవనియాపురం గ్రామ ప్రజలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు మదురై బెంచ్‌ న్యాయమూర్తి శశిధరన్‌… అవినియాపురంలో జల్లికట్టు పోటీల నిర్వహణకు న్యాయస్థానమే ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని, ఈ కమిటీ ఎంపిక చేసిన వారు అవనియాపురంలో ఈ పోటీలను నిర్వహించేలా ఆదేశిస్తారని న్యాయమూర్తి వెల్లడించారు.

తాజా సమాచారం