చైనా కాన్సులేట్‌పై దాడిలో భారత పాత్ర పాక్‌ ఆరోపణ.. ఖండించిన భారత్‌

కరాచీ/దిల్లీ: కరాచీలోని చైనా కాన్సులేట్‌ కార్యాలయంపై నవంబర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత గూఢచర్య సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) పాత్ర ఉందని పాకిస్థాన్‌ పోలీసులు శుక్రవారం ఆరోపించారు. ఇది తప్పుడు ఆరోపణ అని భారత్‌ ఖండించింది. నవంబర్‌ 23న జరిగిన ఆ దాడికి సంబంధించి ఐదుగురు నిందితులను కరాచీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా వేర్పాటువాద ‘బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ’కి చెందినవారని పేర్కొంది. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌)ను అడ్డుకోవడానికి ఈ దాడిని జరిపారని తెలిపింది. దాడిలో హతమైన ముగ్గురు ఉగ్రవాదులకు తాము తోడ్పాటు అందించామని నిందితులు అంగీకరించినట్లు కరాచీ పోలీసు విభాగం అధిపతి అమీర్‌ షేక్‌ చెప్పారు. ఈ దాడికి కుట్ర అఫ్గానిస్థాన్‌లో జరిగిందని చెప్పారు. దీనికి ‘రా’ సహకరించిందన్నారు. ఈ ఆరోపణలను దిల్లీలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖండించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos