గ్యాస్‌పై అవగాహన అంతంతే

గ్యాస్‌పై అవగాహన అంతంతే

హైదరాబాద్‌ : వంట గ్యాస్‌ ప్రమాదాలతో భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆస్తులతోపాటు ప్రాణ నష్టమూ జరుగుతోంది. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా గ్యాస్‌ వినియోగంపై ప్రజల్లో అవగాహన అంతంత మాత్రంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల కాప్రాలో జరిగిన గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ ప్రమాదం నగర వాసులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. గ్యాస్‌ వినియోగంపై అవగాహన లేమి, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వేలో తెలిసింది. గ్యాస్‌ సిలిండర్ల లీకేజీ, స్టవ్‌లు, రబ్బర్‌ ట్యూబ్‌ వినియోగంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా సర్వే నిర్వహించింది. నగర వ్యాప్తంగా మొత్తం 1000 మందిని ఈ సర్వేలో భాగస్వాములు చేసి, పలు అంశాలపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. నగరంలోని కూకట్‌పల్లి, ఆబిడ్స్‌, చిక్కడపల్లి, అమీర్‌పేట, మెహిదీపట్నం, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోని ప్రజలను పలు అంశాలపై ఆంధ్రజ్యోతి ప్రశ్నించి వారి అభిప్రాయాలను తెలుసుకుంది. సర్వేలో భాగంగా గ్యాస్‌ వినియోగంలో సిలిండర్ల లీకేజీలను ఎదుర్కొవడంపై అవగాహన ఉందా..? సిలిండర్లపై ఉండే టెస్ట్‌ డ్యూడేట్‌ గురించి తెలుసా..?, తరచూ రెగ్యులేటర్‌, స్టౌవ్‌, రబ్బర్‌ ట్యూబ్‌ను చెక్‌ చేయిస్తున్నారా..?, అదనపు సిలిండర్లు ఎక్కడ పెడుతున్నారు?, గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ అయిన వెంటనే చెక్‌ చేసుకుంటున్నారా..? గ్యాస్‌ సిలిండర్ల భద్రత సమస్యలు వస్తే డీలర్‌ నుంచి సహాయం అందుతుందా..? అన్న ప్రశ్నలకు నగరవాసుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భద్రతపై అవగాహన తక్కువే…వంట గ్యాస్‌ వినియోగంలో పూర్తిస్థాయిలో అవగాహన లేనట్టు సర్వేలో స్పష్టమైంది. గ్యాస్‌ వినియోగంలో సిలిండర్ల లీకేజీలను ఎదుర్కోవడంపై అవగాహన ఉందా..? అని అడిగితే 48 శాతం మంది ఉందని, 52 శాతం లేదని చెప్పారు. ఇక సిలిండర్లపై ఉండే టెస్ట్‌ డ్యూడేట్‌ గురించి తెలుసా..? అన్న ప్రశ్నకు తెలియదు అని 65 శాతం మంది అంటే 35 శాతం మంది మాత్రమే తెలుసు అని సమాధానం ఇచ్చారు. తరచూ రెగ్యులేటర్‌, స్టౌవ్‌, రబ్బర్‌ ట్యూబ్‌ను చెక్‌ చేయిస్తున్నారా..?అని అడిగితే చేయిస్తున్నామని 55 శాతం చెబితే, 45 శాతం మంది మాత్రం చేయించడం లేదని చెప్పారు. ఇక అదనపు సిలిండర్లు ఎక్కడ పెడుతున్నారు? అని అడిగితే కిచెన్‌లోనే పెడతామని 45 శాతం మంది, స్టోర్‌ రూంలో పెడతామని 45 శాతం మంది, ఆరుబయట పెడతామని 10 శాతం మంది తెలిపారు. గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ అయిన వెంటనే చెక్‌ చేసుకుంటున్నామని 78 శాతం చెప్పగా, 22 శాతం మంది తనిఖీ చేసుకోవడం లేదని చెప్పారు. ఇక గ్యాస్‌ సిలిండర్లకు సంబంధించి భద్రత సమస్యలు వస్తే డీలర్‌ నుంచి సహాయం అందుతుందా..? అని అడిగితే అందుతోందని 70 శాతం మంది, సరిగా అందడం లేదని 30 శాతం మంది చెప్పారు. మొత్తం మీద వంట గ్యాస్‌ వినియోగంలో నగర వాసులకు భయం ఉన్నా, అదే స్థాయిలో నిరంతరం అప్రమత్తంగా ఉండడం లేదనేది స్పష్టమవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos