గూడూరులోఆచితూచి అడుగులేస్తున్న టీడీపీ

ఆచితూచి అడుగులేస్తున్న టీడీపీ
గూడూరు, నెల్లూరు: గూడూరులో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. జన్మభూమి-మాఊరు పేరిట తెలుగుదేశం, ఇటు రావాలి జగన్‌-కావాలి జగన్‌ కార్యక్రమాల ద్వారా వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పొణకా దేవసేన తొమ్మిది మంది కౌన్సిలర్లు, ఒక ఎంపీపీతో ఆకస్మాత్తుగా వైసీపీలో చేరిపోయారు. దీంతో గూడూరులో రాజకీయ విశ్లేషణ మొదలయింది. అసలే వైసీపీలో వర్గపోరు ఎక్కువైన నేపథ్యంలో తాజా పరిణామం ఏస్థాయికి చేర్చుతుందోనని కేడర్‌ భావిస్తోంది.

గూడూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పొణకా దేవసేన పార్టీ మారుతారనే ప్రచారం ఏడాదిగా సాగోతుంది. ఈ క్రమంలో పార్టీ మారే సమయంలో రాజకీయ కుదుపులు మొదలవుతాయని ఆశించారు. అయితే, ఏమాత్రం హడావుడి లేకుండా తమ వర్గానికి చెందిన కౌన్సిలర్లు, నాయకులతో కలిసి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో అధిష్ఠానం రాష్ట్ర పార్టీ నాయకుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌లను ఇచ్చాపు రం పిలిపించింది. వారి సమక్షంలో ఒక్కటై నిలిచినట్లు పార్టీ నాయకత్వం చూపించింది.

వైసీపీలో సయోధ్య కుదిరేనా!?
గూడూరు వైసీపీలో చాపకింద నీరులా వర్గపోరు ఎక్కువైంది. ఒక నాయకుడికి మరో నాయకుడి మధ్య సఖ్యత ఉండటం లేదు. ఈ క్రమంలో పొణకా దంపతులు పార్టీలో చేరారు. వీరు ఎవరికి మద్దతు ఇస్తారనే విషయమై కార్యకర్తలలో చర్చ సాగుతోంది. ఇప్పటికే సమన్వయకర్తగా ఉన్న మేరిగ మురళీధర్‌ను అభ్యర్థిగా పలువురు మద్దతు ఇవ్వాలని పార్టీ పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అదేక్రమంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు సైతం మురళీధర్‌ను గెలిపించాలని పలు సభల్లో కోరారు. కాగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నల్లపరెడ్ల వ్యతిరేక రాజకీయాలు నడుపుతున్నారు. పేర్నాటి అనుకూలంగా బత్తిని విజయకుమార్‌ వైసీపీ టికెట్టు కోసం యత్నిస్తున్నారు. 2014లో వైసీపీ టికెట్‌ ఆశించారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా బరిలో నిలిచిన మనపాటి రవీంద్రబాబు ఇప్పుడు ఇచ్చాపురంలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు.

ఇప్పటికే పరిశీలకుడు సజ్జల వద్ద నాయకులు ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పుడు పొణకా దంపతులు వైసీపీలో చేరడంతో పలు విశ్లేషణలు మొదలయ్యాయి. వీరు మేరిగ మురళీధర్‌తో కొనసాగుతారా!? లేదా ఎల్లసిరి గోపాల్‌రెడ్డితో సఖ్యతగా ఉంటారా!? మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కోడూరు కల్పలతతో కలిసి సాగుతారా!? నేదురుమల్లి, నల్లపరెడ్డి, పేర్నాటి వర్గాలను కాదని కొత్తగా తమకంటూ ప్రత్యేక వర్గంగా ఉంటారా!? ఎమ్మెల్యే అభ్యర్థి అంశంలో వీరి వైఖరి ఏమిటనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. వీరి చేరికతో ఎలాంటి పోకడలు పార్టీలో మొదలవుతాయని ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. అదేవిధంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ ఐదునెలలు ఉం టుంది. మున్సిపాలిటీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయోనని ఎదురుచూస్తున్నారు.

టీడీపీ ఆచితూచి అడుగులు..
పొణకా వైసీపీలో చేరడంపై టీడీపీ నాయకులు అచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే దేవసేన, కౌన్సిలర్లు పార్టీని వీడటం ఈ సమయంలో పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నారు. పొణకా దేవసేన పార్టీని వీడారనగానే సోమవారం నాడు గూడూరలో మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ శీలం కిరణ్‌కుమార్‌, నల్లపరెడ్డి జగన్మోహన్‌రెడ్డిలు నాయకులు, కౌన్సిలర్లతో సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా కోరారు. దేవసేన తదితరులు పార్టీని వీడిన తర్వాత జరిగే పరిణామాలపై చర్చించారు అయితే పొణకా దంపతులు పార్టీని వీడటం పై టీడీపీ నాయకు లు సైతం విమర్శలు చేయడం లేదు. ప్రస్తుతం పార్టీ మారిన కౌన్సిలర్లు ఉండే వార్డులలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసే పనిలో నిమగ్నం కావాలని సూచించినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం