క్లెయిమ్‌ చేయని సొమ్ము రాబట్టుకోవడం ఎలా?

  • In Money
  • January 14, 2019
  • 762 Views
క్లెయిమ్‌ చేయని సొమ్ము రాబట్టుకోవడం ఎలా?

మీ బీమా పాలసీలో క్లెయిమ్‌ చేయని సొమ్ములేమైనా ఉన్నాయా, భయపడాల్సిన అవసరం లేదు. మీ సొమ్ము సంబంధిత బీమా కంపెనీ వద్ద సురక్షితంగా ఉంటుంది. అవసరమైన పత్రాలు సమర్పించి ఆ మొత్తం మీరు తీసుకోవడం సాధ్యమేనంటున్నారు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ సునీల్‌ శర్మ.బీమా పాలసీదారుల ఖాతాలో జమ అయిన నిధులు పాలసీ గడువు ముగిసిన ఆరు మాసాలు, ఆ పైబడి క్లెయిమ్‌ చేయకుండా ఉండిపోతే వాటిని అన్‌ క్లెయిమ్డ్‌ మనీగా పరిగణిస్తారు. పాలసీలో ప్రీమియం రూపంలో జమ అయిన నిధులు, వాటిపై వడ్డీ అంతా అన్‌క్లెయిమ్డ్‌ మనీ నిర్వచనంలోకి వస్తుంది. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీల్లో అయితే అడ్వాన్స్‌గా పాలసీదారులు చెల్లించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి నుంచి ఆరు మాసాల లోగా సద్దుబాటు చేయకపోయినా అది కూడా అన్‌క్లెయిమ్డ్‌గానే పరిగణిస్తారు. సాధారణంగా పాలసీదారులు కాలపరిమితి ముగియగానే తమ పాలసీలో జమ అయిన మొత్తాన్ని తీసేసుకుంటారు. కాని బీమాపై అవగాహన అంతగా లేని వారు, నిరక్షరాస్యులు, నిరంతరం ఆఫీసు ఒత్తిడిలో పని చేసే వారు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరుగుతూ ఉండే ఉద్యోగుల విషయంలో ఈ జాప్యం జరుగుతూ ఉంటుంది. డెత్‌ క్లెయిమ్‌లు, ఆరోగ్య ప్రయోజన క్లెయిమ్‌లు, మెచ్యూరిటీ క్లెయిమ్‌లు, సర్వైవల్‌ బెనిఫిట్‌, సరెండర్‌ లేదా కాలపరిమితి ముగియకుండానే నిలిచిపోయిన పాలసీలు, రిఫండ్‌ ప్రీమియంలు, సద్దుబాటు చేయని ప్రీమియం డిపాజిట్లు, ఇండెమ్నిటీ బాండ్లు అన్‌క్లెయిమ్డ్‌ నిధులు పేరుకుపోవడానికి కారణం అవుతాయి.
అన్‌క్లెయిమ్డ్‌ నిధులు పేరుకుపోవడానికి కారణాలు…
క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ చేసే సమయానికి లబ్ధిదారుని ఆచూకీ లేదా చిరునామా తెలియకపోవడం
పాలసీదారులు/బీమా ప్రయోజనం కోసం దరఖాస్తు చేసిన వారు బ్యాంకు ఖాతా వివరాలు అందించకపోవడం
లబ్ధిదారుని కెవైసి (నో యువర్‌ కస్టమర్‌ వివరాలు) తెలియ చేయకపోవడం
లబ్ధిదారులు పాలసీలో ఇచ్చిన చిరునామాలో ఉండకపోవడం
ఎలా క్లెయిమ్‌ చేయాలి?
పాలసీదారులు తమ పాలసీ వివరాలతో పాటు కెవైసి వివరాలు కూడా తీసుకుని దగ్గరలోని సంస్థ కార్యాలయాన్ని లేదా కస్టమర్‌ కేర్‌ నంబర్‌ను సంప్రదిస్తే క్లెయిమ్‌ చేయకుండా ఉండిపోయిన సొమ్ము ఎలా తీసుకోవచ్చునో తెలియచేస్తారు. ఆ దరఖాస్తు ఆధారంగా బీమా కంపెనీ పాలసీదారుని గుర్తింపు వివరాలను ఖరారు చేసుకుంటే అతని ఖాతాలో ఉన్న క్లెయిమ్‌ చేయని నిధులను అప్పటివరకు వడ్డీ కూడా జత చేసి చెల్లిస్తుంది.
ఇలాంటి నిధులు సురక్షితమేనా?
బీమా కంపెనీల వద్ద క్లెయిమ్‌ చేయకుండా పేరుకుపోయిన నిధులు సురక్షితంగానే ఉంటాయా అనే అనుమానం చాలా మందికి కలగవచ్చు. కాని పాలసీదారులు/లబ్ధిదారుల ఖాతాల్లో క్లెయిమ్‌ కాకుండా ఉండిపోయిన నిధులను ఏ బీమా సంస్థ అయినా సాధారణ అవసరాలకు వినియోగించడం లేదా మాఫీ చేయడం చెల్లదు. ప్రతీ బీమా కంపెనీ బోర్డులోనూ ఉండే పాలసీ హోల్డర్ల రక్షణ కమిటీ పాలసీదారుల నిధులు సరైన సమయంలో చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. అలాగే లబ్ధిదారులు లేదా పాలసీదారులను గుర్తించినట్టయితే క్లెయిమ్‌ కాకుండా ఉండిపోయిన నిధులు ఆ మేరకు తగ్గాయో, లేదో కూడా కాలానుగుణంగా సమీక్షిస్తూ ఉంటుంది. అలాంటి నిధుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలు, కస్టమర్‌ సర్వీస్‌ నిబంధనల విషయంలో ఆయా సంస్థలను చైతన్యపరుస్తూ ఉంటుంది. అన్‌క్లెయిమ్డ్‌ నిధుల వివరాలను కమిటీ అడిగినప్పుడల్లా అందించాల్సిన బాధ్యత బీమా కంపెనీకి ఉంటుంది. అలాగే బీమా కంపెనీలన్నీ తమ వెబ్‌సైట్‌లో అన్‌క్లెయిమ్డ్‌ నిధుల వివరాలను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి.
ఇలాంటి నిధులను కంపెనీలు ఏం చేస్తాయి?
క్లెయిమ్‌ కాకుండా తమ వద్ద ఉండిపోయిన నిధులను బీమా కంపెనీలు మెరుగైన రాబడులు అందించే ఉపకరణాల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఆ పెట్టుబడిపై వచ్చిన రాబడిలో 0.5 శాతం మొత్తాన్ని నిర్వహణ, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యయాల కింద మినహాయించుకుని మిగతా మొత్తాన్ని అన్‌క్లెయిమ్డ్‌ ఖాతాకు జమ చేస్తూ పోవాలి. 10 సంవత్సరాలకు పైబడి క్లెయిమ్‌ కాకుండా ఉండిపోయిన నిధులను మాత్రం సీనియర్‌ సిటిజెన్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది.
సత్వర సెటిల్మెంట్‌కు చర్యలు
పాలసీ తీసుకున్నప్పుడు పాలసీదారులు అందించిన లబ్ధిదారుల వివరాలతో క్లెయిమ్‌ చేసుకున్న లబ్ధిదారుల వివరాలు సరిపోలకపోతే సరైన లబ్ధిదారుని గుర్తించేందుకు బీమా కంపెనీలు సర్వీస్‌ ప్రొవైడర్ల సేవలు తీసుకుంటున్నాయి. పాలసీదారులతో సరైన సమన్వయం కలిగి ఉండేందుకు కంపెనీలు వారి ప్రత్యామ్నాయ కాంటాక్ట్‌ నంబర్లు, మెయిలింగ్‌ వివరాలు, శాశ్వత అడ్రస్‌ వివరాలు తీసుకుంటాయి. పాలసీదారుల ప్రీమియం, మెచ్యూరిటీ వివరాలను ఎప్పటికప్పుడు ఆయా నంబర్లకు ఎస్‌ఎంఎ్‌సల రూపంలో పంపుతూ ఉంటాయి. తమ అడ్ర్‌సలోగాని, ఫోన్‌ నంబర్లలో గాని, ఈ- మెయిల్‌లో గాని మార్పులేవైనా ఉంటే సరిదిద్దించుకోవలసిన బాధ్యత పాలసీదారుల పైనే ఉంటుంది. అలా చేయలేనప్పుడు ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొనక తప్పదు. తస్మాత్‌ జాగ్రత.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos