కేటీఆర్ లా కేసీఆర్ వాటికి ఒప్పుకోలేదు!

కేటీఆర్ లా కేసీఆర్ వాటికి ఒప్పుకోలేదు!

ఎవరు అవునన్నా.. కాదన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మోస్ట్ పవర్ ఫుల్ అని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన్ను మించిన ప్రజాదరణ ఉన్న నేత కనుచూపు మేర ఎవరూ కనిపించని పరిస్థితి.  నిజానికి ప్రతిపక్షం అన్నదే లేనట్లుగా తయారు చేసుకోవటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తాను చెప్పిన దానికి తగ్గట్లే ఎమ్మెల్యేల్ని గెలిపించుకోవటంలో కేసీఆర్ తన సత్తాను చాటారు.

ప్రస్తుతం జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టిన కేసీఆర్ పట్ల టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పలువురు తమ విధేయతను చాటే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సందర్భంగా ఈ విషయం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేసిన తర్వాత మహిళా నేతలకు ప్రమాణస్వీకారం చేసే అవకాశాన్ని ఇచ్చారు. అక్షర క్రమంలో రేఖా నాయక్ కు మొదట ప్రమాణస్వీకారం చేసే అవకాశం లభించింది.ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రొటెం స్పీకర్ కు నమస్కారం పెట్టిన రేఖా నాయక్.. తర్వాత నేరుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి.. ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ఈ తీరును కేసీఆర్ స్వాగతించకపోవటం గమనార్హం. ఇటీవల టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎన్నికైన తర్వాత పలువురు పార్టీ నేతలు ఆయనకు పాదాభివందనం చేయటం.. అందుకు ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవటంతో గులాబీ నేతలు పలువురు కేటీఆర్ కాళ్లకు పాదాభివందనం చేసేందుకు పోటీ పడ్డారు.దీనికి భిన్నంగా కేసీఆర్ మాత్రం పాదాభివందనం చేసే తీరును పెద్దగా స్వాగతించలేదు. పాదాభివందనాలు చేసేందుకు ప్రయత్నించిన పలువురు నేతల్ని ఆయన వారించారు. రాజకీయంగా తమకు తిరుగులేనట్లుగా ఉండే అధినేతలు.. పాదాభివందనాల్ని అంగీకరించే ధోరణి చాలా రాష్ట్రాల్లో చూస్తున్నదే. కానీ.. అలాంటి సంస్కృతి మంచిది కాదన్న రీతిలో కేసీఆర్ వ్యవహరించిన తీరును సరైనదని చెప్పక తప్పదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos