ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్లు..కర్ణాటకలో కొత్త డీల్

ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్లు..కర్ణాటకలో కొత్త డీల్

పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా నడుస్తోంది. కుమారస్వామి సర్కార్ ను పడగొట్టడానికి ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బీజేపీ పక్కా ప్లాన్ తయారు చేసిందన్న కథనాలు జోరందుకున్నాయి.ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదని వారిని బీజేపీ నాయకులు ముంబైకు తరలించారని కర్ణాటక కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్నమంత్రి డీకే శివకుమార్ చేసిన ఆరోపణతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం తెరపైకి వచ్చింది. కుమారస్వామి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు అరడజనుసార్లు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని ఆయన చెప్పారు. లోక్ సభ ఎన్నికల వ్యూహంలో భాగంగానే జేడీ(ఎస్) – కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లు అన్నీ జరిగితే సంక్రాంతి తర్వాత కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే బీజేపీ కుట్రలను తాము అడ్డుకుంటున్నామని శివకుమార్ అన్నారు. ఈమధ్య  కేబినెట్ నుంచి తొలగించిన రమేష్ ఝరకోలిని ఉపయోగించుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని శివకుమార్ ఆరోపించారు. పదిమంది వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తిప్పుకోవడానికి రమేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఇద్దరు ఎమ్మెల్యే ల విషయంలోనే ఆయన సక్సెస్ అయ్యారని శివకుమార్ చెప్పారు. ఇదిలాఉండగా పార్టీ మారడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ. 30 కోట్లు బీజేపీ ఆఫర్ చేస్తోందని వారం కిందట కాంగ్రెస్ సీనియర్ నేత – మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. జేడీ(ఎస్) కు చెందిన ఎమ్మెల్యేల్లో చీలిక తీసుకురావడం కష్టమని భావించిన బీజేపీ – కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయాలని డిసైడ్ అయిందన్నారు. కాగా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ – జేడీ(ఎస్) అడ్డుకుంటాయని చెప్పారు. బీజేపీ మాయలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పడరని ఆయన అన్నారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్లో ఉన్నారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ‘వారు నాతో టచ్ లోనే ఉన్నారు’ అన్నారు. దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos