ఏపీలో ఎన్నికల ముందు ఈసీ సంచలన నిర్ణయం

ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న సీఈవో సిసోడియాను ఆకస్మికంగా బదిలీ చేయడం జరిగింది. సిసోడియా స్థానంలో సీఈవోగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. పురంధేశ్వరి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో గోపాలకృష్ణ ద్వివేది వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా కూడా ద్వివేది పనిచేశారు. కాగా 1993 బ్యాచ్‌కు చెందిన ద్వివేది.. ప్రస్తుతం ఏపీ పశుసంవర్దక శాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఉత్తర్వులు అందిన అనంతరం గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. అందరి సహకారంతో ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహిస్తామన్నారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ ఛాలెంజ్‌గా తీసుకుని ఎన్నికలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. తప్పులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోయేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఓటు విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓట్ల గల్లంతుపై ఓటర్లకు అవగాహన ఉండాలని.. తప్పకుండా ఓటర్లు వారి ఓటును పరిశీలించుకోవాలి అని ఈ సందర్భంగా సీఈవో గోపాలకృష్ణ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos