ఊరు మోడైంది.. కన్నీరు తోడైంది

నర్సాపూర్,: కొంతమంది అయ్యప్ప మాల ధరించిన స్వాములు. మరికొంతమంది అయ్యప్పస్వామిని దర్శించుకుందామని సాధారణ దుస్తుల్లో వెళ్లిన భక్తులు. మండలం రోజుల దీక్ష తర్వాత శబరిమలకు వెళ్తున్న వారిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఏడు రోజుల క్రితం ఊరేగింపుగా సాగనంపారు. ఊహించని ప్రమాదంలో విగతజీవులై తిరిగొచ్చిన తమ వాళ్లను చూసి వాళ్లు గుండెలవిసేలా రోదించగా..గ్రామస్థులు వాళ్లకు తోడుగా కన్నీరు కార్చారు. ఊళ్లకు ఊళ్లుగా కదిలొచ్చి కడసారి వీడ్కోలు పలికారు.

* తమిళనాడు రాష్ట్రం పుదుకోట్టై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మెదక్‌ జిల్లా జిల్లా నర్సాపూర్‌, హత్నూర, వర్గల్‌ మండలాల పరిధి ఖాజీపేట, రెడ్డిపల్లి, మంతూరు, చిన్నచింతకుంట, మంగాపూర్‌, నెంటూరు గ్రామాలకు చెందిన పది మంది అయ్యప్ప భక్తులు మరణించగా, ఐదుగురు గాయపడిన విషయం విదితమే. మృతదేహాలు మంగళవారం ఉదయానికి స్వగ్రామాలకు చేరుకుంటాయని అధికారులు సమాచారం అందించినా అది సాధ్యం కాలేదు. సాయంత్రం వరకు బాధిత కుటుంబాలకు నిరీక్షణ తప్పలేదు.
* దాదాపు 5.30 గంటల ప్రాంతంలో పది అంబులెన్సులు నర్సాపూర్‌కు చేరుకున్నాయి. మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు రాజమణి, జిల్లా పాలానాధికారి ధర్మారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత అంబులెన్స్‌లను ర్యాలీగా మృతుల స్వస్థలాలకు తరలించారు. నర్సాపూర్‌లో వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. మృతుల భౌతిక దేహాలు ఆయా గ్రామాలకు చేరుకున్న తరుణంలో బంధువులు, గ్రామస్థుల్లో విషాదం కట్టలు తెంచుకుంది. ఈ తరుణంలో ఆయా గ్రామాల్లో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.
* ప్రవీణ్‌గౌడ్‌ మృతదేహాన్ని ముందుగా అమ్మమ్మ గ్రామమైన చిన్నచింతకుంటకు తరలించి, అక్కణ్నుంచి స్వగ్రామం మెదక్‌ మండలం మగ్దుంపూర్‌కు తీసుకెళ్లారు.
* జన్ముల సురేశ్‌కు చిన్నచింతకుంట గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. నక్క ఆంజనేయలు, అంబర్‌పేట కృష్ణలకు రెడ్డిపల్లిలో, శివప్రసాద్‌, శ్యామ్‌ సుందర్‌గౌడ్‌లకు మంతూరులో, నాగరాజుగౌడ్‌ (గురుస్వామి), జుర్రు మహేశ్‌, బోయిని కుమార్‌లకు ఖాజీపేటలో, రాజేశ్‌ గౌడ్‌కు వర్గల్‌ మండలం నెంటూరులో అధికారుల పర్యవేక్షణలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

తాజా సమాచారం