ఈవీఎంలను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారు

ఈవీఎంలను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారు

విజయవాడ: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వేర్వేరుగా ఫలితాలు వచ్చినప్పటకీ.. ఈవీఎంలను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా   వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వివిధ పక్షాలు ఈవీఎంలపై ఆరోపణలు చేయటం తగదన్నారు. 2010 నుంచి ఈవీఎంల హ్యాకింగ్‌, ట్యాంపరింగ్‌ వంటి అంశాలపై ఐఐటీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన సాంకేతిక నిపుణుల కమిటీ పనిచేస్తుందని వివరించారు. లండన్‌లో ఈవీఎంలపై చేసిన విన్యాసాలు గురించి దేశంలో అందరికీ తెలుసన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజులుగా వివిధ రాజకీయ పక్షాలతో, అధికారులతో సమావేశమయ్యామని ఆయన వివరించారు. అన్ని పార్టీల నుంచి అభ్యంతరాలను, సూచనలు తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లకు ముందస్తు తేదీలతో చెక్కుల పంపిణీపై  తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. దురుద్దేశ పూర్వకమైన వ్యవహారాలు ఉంటే ఈసీ కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన తేల్చి చెప్పారు.  నామినేషన్ల ఆఖరు తేదీ వరకూ  ఓటర్ల జాబితా తనిఖీ చేస్తామని తెలిపారు. నకిలీ ఓటర్లు, ఓట్ల తొలగింపు వ్యవహారాలపై కూడా ఫిర్యాదులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో నగదు పంపిణీ వంటి అంశాలపై ఇప్పటి నుంచే నిఘా ఏర్పాటు చేశామని .. ఆదాయపన్నుశాఖ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ నేతృత్వంలో ఓ బృందం నగదు లావాదేవీలపై దృష్టి పెట్టిందని చెప్పారు. కులాల ఆధారంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయలేమని ఆరోరా స్పష్టం చేశారు. పెయిడ్‌ న్యూస్‌పై కూడా ప్రత్యేక  విభాగం పనిచేస్తోందన్నారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సీఈసీ సమావేశమయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos