అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం.. అహ్మదాబాద్‌లో

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ స్టేడియం(మోటేరా స్టేడియం) త్వరలోనే అరుదైన ఘనత సాధించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంగా గుర్తింపు దక్కించుకోబోతోంది. అహ్మదాబాద్‌లోని మోటేరా ప్రాంతంలో ఉన్న ఈ స్టేడియం విస్తరణ పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పరిమల్‌ నథ్వాని ఇటీవల ట్వీట్ చేశారు.

‘ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం.. మెల్‌బోర్న్‌ కంటే పెద్దదైన మైదానాన్ని అహ్మదాబాద్‌లోని మోటేరాలో నిర్మిస్తున్నాం. గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కలల ప్రాజెక్ట్‌ అయిన ఈ మైదానం పూర్తయితే యావత్‌ భారత్‌కు ఖ్యాతి తీసుకొస్తుంది’ అని పరిమల్‌ ట్వీట్‌ చేశారు.

మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. ఈ మైదానంలో 49వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. 1983లో ఈ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్‌ వెస్టిండిస్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ ఈ స్టేడియంలోనే టెస్టు‌ క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. అంతేగాక.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ఇదే మైదానంలో తన టెస్ట్‌ కెరీర్‌లో తొలి ద్విశతకాన్ని నమోదుచేశారు.

2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఆ తర్వాత స్టేడియంను మూసివేసి విస్తరణ పనులు చేపట్టారు. 2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 1,10,000 మంది కూర్చునేలా స్టేడియంను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos