అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి

అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలను తక్షణమే ఆన్‌లైన్‌లో పెట్టాలని వైసిపి అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వైసిపి నేతలు మంగళగిరిలో ఉన్న డిజిపి కార్యాలయంలో అదనపు డిజిపిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. గడచిన నాలుగున్నరేళ్లుగా అగ్రిగోల్డ్‌ కుంభకోణానికి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారనీ, సిబిసిఐడి దర్యాప్తు అనంతరం అధికారులు చెబుతున్న మాటలకు రాష్ట్ర ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారనీ పేర్కొన్నారు. సిబిసిఐడి దర్యాప్తు అనంతరం 19.50లక్షల బాధితులు ఉన్నారని శాసనసభలో మంత్రి చెబితే, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు 10లక్షల బాధితులే ఉన్నారనడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు.
కుటుంబరావు అగ్రిగోల్డ్‌ ఆస్తుల గురించి చెబుతున్న అంశాల్లో పలు అనుమానాలున్నాయనీ, బాధితులను దృష్టిలో పెట్టుకుని సిబిసిఐడి సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తును వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. కమిటీ సభ్యుల్లో ఎంఎల్‌ఎ గోపిరెడ్డిశ్రీనివాసరెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, లేళ్ల అప్పిరెడ్డి, అడపా శేషు తదితరులు ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos