
హైదరాబాద్: తాను బాధ్యుడుగా వ్యవహరిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లో వైకాపా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని జగన్ చిన్నాన్న,లోక్‌సభ మాజీ సభ్యుడు వై.వీ. సుబ్బారెడ్డి గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులకు తెలిపారు. ఒంగోలు నుంచి పోటీ చేసే అవకాశం లభించక పోవటంతో అలకబూనారనే ప్రచారం గురించి వివరించారు. తాను ఒంగోలు టికెట్ ఆశించిన మాట వాస్తవ మేనన్నారు. ఇతరులకు టికెట్ కేటాయించడం పార్టీ నిర్ణయమన్నారు. వ్యక్తి గత పనుల కోసం విదే శాలకు వెళ్లిన తను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజ కీయ పరిస్థితుల దృష్ట్యా జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కటం అనివార్యమన్నారు. ఇందు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. రాజ్యసభకు పోటీకి జగన్ ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించినట్లు చెప్పరు. తనకు ప్రత్యక్ష రాజకీయాలంటేనే ఆసక్తి అన్నారు. ఒంగోలు లోక సభ స్థానం నుంచి పోటీకి టికెట్ లభించక పోవడంతో పది రోజులుగా ఎవరికీ అందుబాటులో లేరు. టంగుటూరులో బుధవారం పార్టీ అధినేత జగన్ నిర్వహించిన బహిరంగ సభకు సుబ్బారెడ్డి హాజరు కాలేదు. వివేకానంద రెడ్డి అంత్య క్రియలకూ ఆయన హాజరు కాక పోవటం చర్చనీయాంశమైంది.