రూపాయి నాణేలతో రూ.2.6 లక్షల బైక్ కొనుగోలు

రూపాయి నాణేలతో రూ.2.6 లక్షల బైక్ కొనుగోలు

భూపతి అనే యువకుడు తమిళనాడులోని సేలం నగరంలో నివసిస్తుంటాడు. ఓ చిన్న ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. భూపతి యూట్యూబర్ కూడా. అతడికి ఫాలోవర్లు కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉన్నారు. బజాజ్ డామినార్ 400 సీసీ బైక్ అంటే అతడికి చెప్పలేనంత ఇష్టం. దీన్ని కొనాలని ఎన్నాళ్లుగానో డబ్బులు కూడబెడుతున్నాడు. బైక్ ఖరీదు దాదాపు రూ. 2.6 లక్షలు. అయితే.. ఈ మొత్తాన్ని అతడు నాణేల్లోనే పోగేశాడు. అన్నీ రూపాయి నాణేలే! బస్తాల కొద్దీ పోగుబడ్డ కాయిన్లు అవి. ఇటీవల ఓ రోజు అతడు, తన స్నేహితులతో కలిసి ఆ నాణేలను ఓ మినీ వ్యానులో తీసుకుని షో రూంకు వెళ్లాడు. బస్తాల్లో ఉన్న నాణేలను పెద్ద ట్రాలీలో పెట్టుకుని లోపలికివస్తున్న వారిని చూసి షో రూం మేనేజర్ మహావిక్రాంత్ షాకైపోయారు.
నాణేలు తీసుకునేందుకు మేనేజర్ మొదట్లో కాస్త తటపటాయించారు. ‘‘లక్ష రూపాయలను( రూ. 2 వేల నోట్లలో..) లెక్కించేందుకే బ్యాంకు వారు రూ. 140 కమిషన్‌గా తీసుకుంటారు. మరి ఇంత డబ్బును.. అదీ రూపాయి నాణేల్లో తీసుకెళితే వారు అంగీకరిస్తారో లేదో అనే సందేహం కలిగింది. కానీ.. అది తన కలల బైక్ అని భూపతి చెప్పడంతో చివరికి ఒప్పుకున్నాను’’ అని మేనేజర్ తెలిపారు. అన్నట్టు.. ఆ డబ్బు మొత్తా్న్ని లెక్కించేందుకు షోరూం సిబ్బంది.. భూపతి, అతడి స్నేహితుల సహాయం కూడా తీసుకున్నారు. ఆ తరువాత కూడా వారికి నాణేలు లెక్కించేందుకు ఏకంగా 10 గంటల సమయం పట్టింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos