ఇదేనా నీ సంతకం విలువ?

ఇదేనా నీ సంతకం విలువ?

అమరావతి:సూపర్‌ సిక్స్‌ పేరుతో చంద్రబాబు ప్రజలను నినలువునా మోసం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని శ్యామల అన్నారు. శనివారం ఆరె శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నమ్మించి, మాటిచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే అని ఎద్దేవా చేశారు. చేతగానప్పుడు.. చేయలేనప్పుడు.. శుష్క వాగ్దానాలు చేయకూడదని హితవు పలికారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో బాండ్‌ పేపర్లు ఇచ్చి మరీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ఇదేనా నీ సంతకం విలువ అని ప్రశ్నించారు. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చని తెలిపారు. హామీలు మాత్రం జనాల్లో ఇచ్చి.. పథకాలను ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. తల్లికి వందనం పేరు చెప్పి జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అమ్మ ఒడి పథకాన్ని కూడా ఆపేశారని విమర్శించారు. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనాల్లోకి వచ్చి చెప్పాలన్నారు.2025 జనవరి 1వ తేదీన జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని నారా లోకేశ్‌ ప్రకటించిన విషయాన్ని చేశారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదు కదా.. కనీసం జాబ్‌ క్యాలెండర్‌ ఎప్పుడు ప్రకటిస్తారనే విషయాన్ని కూడా చెప్పడం లేదని విమర్శించారు. హామీలు అమలు చేయలేకపోవడంపై కూటమి నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే బాగుండేదని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారని తెలిపారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీల అమలుపై వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు సంపద సృష్టి అని చంద్రబాబు అంటే ప్రజలకేమో అని అనుకున్నామని.. కానీ ఆయన సొంతంగా సంపద సృష్టించుకోవడం అని ఇప్పుడే తెలిసిందని ఎద్దేవా చేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos