అంతర్గత కుమ్ములాటలో కన్నడ కమలనాధులు

అంతర్గత కుమ్ములాటలో కన్నడ కమలనాధులు

బెంగళూరు: పట్టుదలకు ప్రతీకైన ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధినాయకత్వంతో హోరా హోరీకి సిద్ధమయ్యారా? ఆయన అనుసరిస్తున్న పరిపాలన వైఖరి ఇందుకు తిరుగులేని సాక్షమని విశ్లేషకుల మదింపు. యడ్యూరప్ప కు నేడో రేపో ఉద్వాసన తప్పదని ఆయన పార్టీ నేతలో చాపకింద నీరులా ప్రచారాన్ని చేస్తున్న దశలో హఠాత్తుగా ఆయన అనూయాయులకు పదవుల పందారం చేయటం అనేక అనుమానాలకు తావిస్తోంది.తనకు ముప్పు తలపెట్టేవారు ఎంతటి వారైన సరే ఎదురు తిరగటం యడ్యూరప్ప నైజం. పాలక పక్షంలో జరుగుతున్న పలు సంఘటనలు ఇందుకు ఊతమిస్తున్నాయి.
వ్యక్తుల వర్చస్సు,ఆకర్షణతో నిమిత్తం లేకుండా భాజపాను కింది స్థాయి నుంచి నిర్మించి పటిష్టమంతం చేయాలనే యోచనతో పార్టీ అధ్యక్షుడు నళినికుమార్ కటీల్ పావులు కదుపుతున్నారు. యడ్యూరప్ప లేకుండానే గ్రామ పంచాయతి ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే సన్నాహాల్లో తలమునకలయ్యారు. శ్రేణుల్ని సమీకరించి సంఘటిత పరచేందుకు మంత్రులు, ఇతర నాయకులతో రాష్ట్ర మంతటా పర్యటించదలచారు. యడ్యూరప్ప లేని భాజపాను ఊహించజాలమనే వాదంలో నిజంలేదని నిరూపించటమే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. పరివార్ ప్రముఖుడు, మో.షాలకు అత్యతంత ఆప్తుడు, యడ్యూరప్పకు బద్ధవైరి అయిన సంతోష్ తెర వెనుక సూత్రధారి అని పార్టీ వర్గాల కథనం.
తన బలాన్ని వృద్ధి చేసుకునేందుకే యడ్యూరప్ప వీర శైవ లింగాయ అభివృద్ధి సంస్థను నియమించటమే కాకుండా ఏకంగా రూ.ఐదు వందల కోట్లు నిధుల్ని ఈ ఏడాదికి కేటాయించారు. విడుదల కూడా చేయనున్నారు. గతంలో యడ్యూరప్ప కర్నాటక జనతా పార్టీని స్థాపించి రాజకీయంగా తన సత్తాను నిరూపించారు. యడ్యూరప్ప లేకుంటే భాజపా మనుగడ ప్రశ్నార్థకమని తేల్చి చెప్పారు. ఆ ఎన్నికల్లో యడ్యూరప్ప కులస్తులైన వీర శైవుల్లో అత్యధికులు భాజపాకు అండగా నిలబడక పోవటంతో భాజపా చతికిల బడింది. తదుపరి రాజకీయ పరిణామాల్లో యడ్యూరప్ప మళ్లీ కమలాన్నిచేబ్టటటంతో భాజపా జవసత్వాల్ని పుంజుకుందనేది తిరుగు లేని నిజం. వయస్సు పైబడిన కారణంగా తనను గద్దె దింపనున్నారనే చేదు నిజాన్ని యడ్యూరప్ప జీర్ణించుకోలే పోతున్నారు. పూర్తి కాలం అధికారంలో కొనసాగేందుకు అన్ని రకాల ఎత్తుగడల్లో తలమునకలయ్యారు. ఆత్మీయులు వద్దన్నా వీరశైవ లింగాయత అభివృద్ధి సంస్థను స్థాపించటం ద్వార వారి మద్ధతును మరో సారి కూడగట్ట దలచారనేది బహిరంగ సత్యం. నమ్మిన వారిని తగు రీతిలో గౌరవించటం తొలి నుంచి యడ్యూరప్ప వ్యక్తి గత, రాజకీయ లక్షణం. విధానం కూడా. గత రెండు, మూడు రోజుల్లో పలువురిని ప్రాధికార, ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్షులుగా నియమించారు. దరిమిలా ఆయా సామాజిక వర్గాల అండనూ పొందటం మరో ఎత్తుగడ.
అధినాయకత్వం కూడా ఆచి తూచి, దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయదలచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘యడ్యూరప్ప నిష్క్రమణ అంత ఆషామాషీ వ్యవహారం కాదని నాయకత్వానికీ తెలుసు. ఆయన్ను గద్దె దించినా పార్టీ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగుతుంది. వచ్చే విధాన సభ ఎన్నికలపై ఏ విధమైన ఆశా లేదు. ఆ తర్వాతి ఎన్నికల కల్లా పార్టీని గెలుపు బాటలోకి నడిపించటమే ధ్యేయం. విధానాల రీత్యా ప్రజాభిమానాన్ని చూరగొనటమే ఆశయమ’ని వివరించారు. మొత్తం మీద భాజపా రాజకీయాలు నెమ్మదిగా రంగు దేలుతున్నాయి. రసవత్తరంగా మారాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos